గ్రూప్ వన్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వచ్చే జూన్ 9 వ తేదీన జరిగే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు కాన్పరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వచ్చే జూన్ 9 వ తేదీన భువనగిరి పట్టణంలోని తొమ్మిది పరీక్షా కేంద్రాలలో మదర్ థెరిసా హైస్కూల్, మాంటెస్సోరీ హైస్కూల్, దివ్యబాల విద్యాలయం హైస్కూలు, వెన్నెల ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, భువనగిరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పెంటగీనగర్ లోని ఎస్ ఎల్ ఎన్ ఎస్  కాలేజీ, పహాడీనగర్ లోని శ్రీ నవభారత్ డిగ్రీ, పిజి కాలేజీ, ఆజాద్ రోడ్ లోని సెంటర్ -A కేంద్రాలలో గ్రూపు-1 ( టిఎస్పిఎస్ సి) పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొత్తం 3349 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలియచేస్తూ ఇందుకోసం ఇద్దరు రూట్ ఆఫీసర్లను, ప్రతి సెంటర్ కు ఒక అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరిగిందని ,రెండు  ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా పర్యవేక్షించాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దివ్యాంగ అభ్యర్ధుల కోసం స్క్రైబ్ లను నియమించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో నిబంధల మేరకు బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని, పరీక్ష రోజు అన్ని జీరాక్సు షాపులు బంద్ చేసి ఉండేలా చర్యలు తీసుకోవాలని, రెండు రూట్లకు సంబంధించి పరీక్ష మెటీరియల్ రవాణా కోసం వాహనాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష రోజు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల కోసం అదనంగా, ప్రత్యేకంగా బస్సులు నడపాలని, తొమ్మిది పరీక్షా కేంద్రాలలో మందులతో మెడికల్ క్యాంపులు, అంబులెన్సు ఏర్పాటు చేయాలని, పరీక్ష రోజున ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సరఫరా ఉండాలని, పరీక్షకు రెండు రోజుల ముందే కేంద్రాలలో పరిశుభ్రంగా పారిశుద్య చర్యలు పూర్తి చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
అభ్యర్ధులను పరీక్ష రోజు ఉదయం 9.00 గంటల నుండే అనుమతించడం జరుగుతుందని, ఉదయం 10.00 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయడం జరుగుతుందని, ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరని, అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. పరీక్షా సమయం 10-30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్స్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎట్టి పరిస్థితిలో అనుమంచబడవని, ప్రతి అభ్యర్దికి బయోమెట్రిక్ చేయడం జరుగుతుందని, చేతులకు గోరింటాకు,కోన్ ఉండరాదని తెలిపారు. చెప్పలు మాత్రమే ధరించి రావాలని, సాక్స్ బూట్లు ధరించి రావద్దని, అభ్యర్ధులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులు తెచ్చుకోవాలని, తమ వెంట హాల్ టికెట్ తో పాటు ఐడి ప్రూఫ్ గా ఫోటోతో కూడిన ఐడి కార్డు తెచ్చుకోవాలని సూచిస్తూ అభ్యర్థులు పరీక్ష రోజుకు రెండు మూడు రోజుల ముందే తమ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించుకోవాలని, తద్వారా నిర్ణీత సమయంలో పరీక్హ కేంద్రానికి చేరుకోవచ్చునని సూచించారు. ఈ  సమావేశానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కే గంగాధర్, జిల్లా విద్యాశాఖ అధికారి కే.నారాయణరెడ్డి, జిల్లాకు సంబంధించి గ్రూప్-1 పరీక్ష నిర్వహణ రీజనల్ కోఆర్డినేటరు డాక్టర్ హలావత్ బాలజీ, రాచకొండ ఎసిపి టి కరుణాకర్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ పాపారావు, తహశిలుదారు అంజిరెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి రమణి, జిల్లా పౌర సంబంధాల అధికారి పి వెంకటేశ్వరరావు, విద్యుత్, రవాణ, ఆర్టిసి  సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.