
– ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలి
– నాంపల్లి ఏరియా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులకు సూచించారు. గురువారం నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో కలిసి ఆయన సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు ఆరోగ్యశ్రీ,, బయో లేబరేటరీ,సర్జికల్ ఓపి, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఆయుష్మాన్ భారత్ హెల్ప్ డెస్క్, చిల్డ్రన్స్ ఓపి విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని డేటా ఎంట్రీ ఆపరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు. కలెక్టర్ చిల్డ్రన్స్ వార్డులో పిల్లలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వేచి ఉన్న గర్భిణులతో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి కాన్ఫిరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి డాక్టర్ లు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే మరింత మెరుగైన వైద్య సేవలు రోగులకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో పడకల స్థాయి అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపవలసిందిగా తెలిపారు.ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల భర్తీకి, ఆస్పత్రి కావాల్సిన పరికరాల కోసం కొనుగోలు కోసం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆస్పత్రి కి వైట్ వాష్ చేయవలసిందిగా, డ్రైనేజీ సరిగా ఉండేలా చూడవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, కార్పొరేటర్ జాఫర్ ఖాన్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ సునీత,ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి సునీత, నాంపల్లి మండల తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అర్ ఎం ఓ డాక్టర్ రమ, డాక్టర్ శ్రీదేవి, నర్సింగ్ సూపర్డెంట్ పద్మలత, ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇంచార్జ్ ఎం సదానంద్, వై శ్రీనివాస్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.