అమ్మ ఆదర్శ పథకం పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

నవతెలంగాణ – మల్హర్ రావు
అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతుల పనుల్లో వేగం పెంచాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గుత్తేదారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలసి మహముత్తారం మండలంలో  సుడిగాలి పర్యటన నిర్వహించి  పాఠశాలల్లో జరుగుతున్నమరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలా వస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకొని విద్యార్థులకు ఆహ్లాదకరంగా తయారు చేయడంతో పాటు నాణ్యమైన  విద్యాబోధన చేసేందుకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా మహముత్తారం మండలం  కోనంపేట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో రూ.3.94 లక్షలతో చేపట్టిన మరమ్మతులను,  కొత్త ముత్తారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో రూ.3. 84 లక్షలతో చేపట్టిన పనులు,  మహముత్తారం గ్రామంలోని కెజిబివి పాఠశాలలో రూ.6.30 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేపట్టిన గ్రామ సమాఖ్యలతో మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 5 వ తేదీ వరకు  పూర్తిచేయాలని ఆదేశించారు. ముందస్తుగా 25 శాతం నిధులు మంజూరు చేశామని,   చేపట్టిన పనులకు నిధులు  సరిపోకుంటే ప్రతిపాదనలు పంపాలని,  అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పాఠశాలలు పున: ప్రారంభానికి ముందు పూర్తిస్థాయిలో  చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వివో లను ఆదేశించారు.
  పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచి నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి  అయ్యేలా చొరవ చూపాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  మహముత్తారం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్న డాక్టర్ క్వాటర్స్ ను సందర్శించి ఆగస్టు 15 లోపు భవన నిర్మాణం పూర్తి అవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.  అనంతరం మహముత్తారం లో గల రైతు వేదికలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి మరియు పనులు పూర్తి చేసే గడువును మండలంలోని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టు పనులు చేపట్టిన వివోలతో సమీక్ష నిర్వహించి పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అన్నారు.  పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మహముత్తారం మండలంలో మొత్తం 30 పాఠశాలలకు గాను రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు రైతు వేదిక ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కుట్టించిన  స్కూలు యూనిఫామ్స్ ధరించిన చిన్నారులు జిల్లా కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ నరేష్, సెక్టోరియల్ అధికారి కిషన్ రావు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎం పి డి ఓ శ్రీనివాసరావు,  పంచాయతీ రాజ్  డి ఈ శేషగిరిరావు, ఏ ఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.