
నవతెలంగాణ – భువనగిరి రూరల్
రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే అధికారులకు సూచించారు. శనివారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఆర్.డబ్లు.ఎస్, పంచాయితీరాజ్ ఇంజనీర్లతో ఆయన సమావేశమై ఉపాధి హామీ పనులు, పిఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులు, వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలను మండలాల వారిగా సమీక్షించారు. ఉపాధి పనులలో కూలీల శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామ అవసరాలకు తగిన పనులు గుర్తించాలని, పిఎం విశ్వకర్మ యోజన పథకం అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కలిగించాలని, వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. బల్క్ వాటర్, ఫిర్యాదులు, క్లోరినేషన్, ఓ.హెచ్.ఆర్., క్లీనింగ్, రిపేర్స్, బ్లీచింగ్ పౌడర్, స్టాక్ రిజిస్టర్ సంబంధించి ఏడు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్, గ్రామ పంచాయతీలలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, బోర్ వెల్స్, హ్యాండ్ పంపులు పరిశీలించి యాక్షన్ ప్లాన్ సమర్పించాలని, రిపేర్ల కోసం శాంక్షన్లు పొందాలని, చిన్న చిన్న రిపేర్లు వున్న వాటిని వెంటనే బాగు చేయించాలని, పైప్ లైన్ లీకేజీలు అరికట్టాలని ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అధినం కలెక్టర్ జి వీరారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణన్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కరుణాకరణ్ లు పాల్గొన్నారు.