
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. వెంకటరెడ్డి తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుండి నుండి మార్చి నెల 19 వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో 77 కాలేజీల్లో ఉన్న 16602 మంది విద్యార్థులు ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అదేవిదంగా పరీక్ష కేంద్రాలను 9 జోన్లు గా విభజిస్తూ,ఇద్దరు ప్లయింగ్ స్కాడ్స్,3 టీంలు సిట్టింగ్ స్కాడ్స్,850 మంది ఇన్విజిలేటర్ లను నియమించడం జరిగిందని ప్రతి రోజు 9.00 నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్, త్రాగునీరు, పారిశుద్యం, మెడికల్ శిబిరాలు, ఆర్.టి.సి. బస్ సౌకర్యాలు కల్పించాలని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్ అమలు తప్పక ఉండాలని , కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. ఏ ఒక్క కేంద్రంలో సెల్ ఫోన్ అనుమతించవద్దని అలాగే పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని,విద్యలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , విద్యార్థులకు మానసిక వికాస తరగతులను నిర్వహించి వారిలో పరీక్షల పట్ల ఉన్న భయాందోళన తొలగించాలని అన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో సి.ఈ.ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు,ఇంటర్మీడియెట్ డి.ఈ. సి సభ్యులు జి. లక్ష్మయ్య, కె. శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.