పిల్లల తల్లిదండ్రులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్..

Collector tele conference with parents of children..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పదవ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆయన కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలంటే  వచ్చే  నెలన్నర రోజులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్దవహించి , చదువు పైనే దృష్టిసారించేలా చూడాలని అన్నారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేపి చదువుకోవాలని చెప్పాలని, పరీక్షలు అయ్యేంతవరకు వేరే పని చెప్పకూడదని, ఇంట్లో పనులు, వేరే ఇతర పనులు చెప్పకుండా కేవలం చదువు పైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని, సూచించారు. అలాగే టీవీ, మొబైల్ చూడనివ్వకూడదని తెలిపారు. విద్యార్ధులు ఇంట్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, దీనివల్ల  ప్రశాంతంగా చదువుకొని పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి బాసర ఐఐటిలో సీట్లు సాధించవచ్చని, భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. అందుకు తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద వహించాలని సూచించారు. విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ మీ పాప, బాబు ఎలా చదువుతున్నారు ? బాగా చదువుతారా ? ఇంట్లొ ఎలా ఉంటారు ? తదితర విషయాలు కలెక్టర్ అడిగి తెలుసుకొని విద్యార్ధులు బాగా చదివేందుకు మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. పదవతరగతి విద్యార్థుల వివరాలు, సిలబస్ వివరాలు, వేకప్ కాల్స్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా తాను ఉదయం 5 గంటలకు లేచి 7 గంటల వరకు చదివి పాఠశాలకు వెళ్లేదని క్రమబద్ధంగా పాఠ్యాంశాలను నేర్చుకొని ఈ రోజు మీ ముందు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నానని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో కలెక్టర్ ఉందన్నారు. ప్రణాళిక బద్దంగా చదివించాలని పదవతరగతి లో మంచి ఫలితాలు సాధించి బాసర ఐఐటి కళాశాలలో సీట్లు సంపాదించాల్సిందిగా కోరారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరును కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రణీత, డీసీబీ సెక్రటరీ గజేందర్, ఆరోగ్య పాఠశాల అనుసంధాన కర్త అజయ్, విద్యార్థులు తల్లిందండ్రులు పాల్గొన్నారు.