
– నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ తర్వాత జిల్లాలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని అన్నారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎటువంటి మార్పులు లేవని, మొత్తం 287 స్కూల్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు నూతన పోలింగ్ కేంద్రాలు పెరిగాయని, అదేవిధంగా 3 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మారిందని , అటు వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేసామని అన్నారు. ఓటర్ జాబితా రూపకల్పన పై రాజకీయ పార్టీల ప్రతినిధులు దృష్టి సారించాలని, అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను నవంబర్ 29 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ మరియు సిరిసిల్ల ఆర్డీవోలు రాజేశ్వర్ రమేష్ , బీఎస్పీ పార్టీ ప్రతినిధి ఏ.రమేష్, భాజాపా పార్టీ ప్రతినిధి రేగుల కనకయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సంపత్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి అహ్మద్ ఖాన్, భారాస పార్టీ ప్రతినిధులు రహీం, జి.రాజన్నతెదెపా పార్టీ ప్రతినిధి శంకర్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు , సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.