
గత రెండు రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో కలెక్టర్ వెంకట్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని కంపచెట్లు, చెత్త, శిథిలాలు తొలగించాలని, అన్ని రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థల భవనాలను శుభ్రం చేయాలని మొక్కలకి నీటిని పోయాలని అన్నారు. అంతేకాక శుక్రవారం ప్రతి ఇంటిలో డ్రై డే పాటించాలని తెలిపారు. అనంతరం మహాలక్ష్మి స్కీంలో భాగంగా రూ. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ సంబంధించి డేటా ఎంట్రీని పరిశీలించి, డేటా ఎంట్రీని గురువారం పూర్తి చేయాలని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహేందర్ రెడ్డి, ఎంపిడిఓ తుంగతుర్తి వెంకటాచారి, ఎంపీఓ దొడ్డి నరేష్, ఆర్ఐ దైద స్వప్న, పంచాయతీ కార్యదర్శి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.