– డాక్టర్లు అందుబాటులో ఉండాలి
– రోగులకు తాగునీరును అందుబాటులో ఉంచాలి
– జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డును సునిశితంగా పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను క్షణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఎంత మంది ఉన్నారు, ప్రతి రోజు ఎంత మంది పెషేంట్‌లు వస్తారు, అని పూర్తి వివరాలు అడిగి తెలుసు కున్నారు. వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహిళా, పురుషుల వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్ నమోదు వివరాలు తెలిపే వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు ఆర్డీఓ శ్రీనివాస్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.