డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్..

– కమిషనింగ్ ప్రక్రియ పరిశీలన
నవతెలంగాణ – డిచ్ పల్లి
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సీఎంసీ కళాశాలలోనే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ శనివారం ఈ కేంద్రాలను సందర్శించి కమిషనింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపారు. అదేవిధంగా బోధన్ పట్టణం విజయ మేరీ పాఠశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కొనసాగుతున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వివి.ప్యాట్లలో బ్యాలెట్ పేపరు, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. ఈ నెల 13న జరుగనున్న పోలింగ్ కోసం ఈవీఎంలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈవీఎంలలో అమర్చే పవర్ ప్యాక్స్, రోల్స్ సరిపడా ఉన్నాయా అని ఆరా తీసిన కలెక్టర్, అవసరమైన పక్షంలో మరిన్ని సమకూరుస్తామని అన్నారు. కాగా, బోధన్ పట్టణంలోని తహశీల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించి, ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు ఉన్నారు.