
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి డిచ్ పల్లి మండలంలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎం ల పనితీరును ప్రయోగాత్మకంగా వివిరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పీ.ఎస్ లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సహాయ ఏఆర్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ మకరందు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూం కు పోస్టల్ బ్యాలెట్ల తరలింపు..
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన సీఎంసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూం కు ఆదివారం తరలించారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీయ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చగా, వాటిని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కంటైనర్ వాహనంలో ఆదివారం కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూం కు చేర్చారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా భద్రపర్చి, స్ట్రాంగ్ రూంకు సీల్ వేశారు.