కలెక్టర్ గారు.. మన ఏజెన్సీలో కంటైనర్ ఆస్పత్రి అవసరం..

Collector.. we need a container hospital in our agency..– అత్యవసర సమయంలో చెంచులకు అందని వైద్యం

– సీజన్ వ్యాధుల పట్ల ఏజెన్సీ వాసుల అవస్థలు
నవతెలంగాణ – అచ్చంపేట
ములుగు జిల్లా తాడ్వాయి ఏజెన్సీ పల్లెల్లో అత్యవసర సమయంలో వైద్య వందక అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళడానికి రోడ్డు అద్వానంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో గర్భిణులకు, బాలింతలకు, ప్రమాద సమయంలో  వైద్య అందడం లేదు. 10, 15 కిలోమీటర్లు కాలినడకన వెలవలసి ఉంటుంది. వర్షాకాలంలో సీజన్ వ్యాధుల పట్ల మరెన్నో అవస్థలు పడుతుంటారు. దీన్ని గమనించిన ములుగు జిల్లా కలెక్టర్  దినాకర్ ప్రత్యేక శ్రద్ధతో కంటైనర్ లో ఆస్పత్రి తయారు చేసి పోచపూర్ లో ప్రతిష్టించారు. శనివారం మంత్రి సీతక్కతో ప్రారంభించారు.  కంటైనర్ ఆస్పత్రి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచులకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే తరహాలో నల్లమల్ల చెంచులకు ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.  అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియా లోతట్టు అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గం లేని చోట్ల చెంచుల నివాసం ఉంటున్నారు. వైద్యం అందక ముత్యువాత పడుతున్నారు. విష సర్పాలు కాటుకు గురైన, గర్భిణీలకు పురటి నొప్పులు వచ్చిన, కడుపు నొప్పి వచ్చిన ఆపదలో వైద్యం అందక వారి అరణ్యరోధన ఎవరికి కనిపించదు వినిపించదు. సీజన్ వ్యాధుల్లో విష జ్వరాల బారిన పడిన ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతకాల్సిందేనని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నిర్వీరమైపోయింది. మన్ననూరు (ఐటిడిఏ) ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరిధిలో 150 పైగా చెంచు పెంటలు ఉన్నాయి.14000 చెంచు జనాభా ఉన్నట్లు అధికారుల రికార్డులో నమోదు ఉన్నాయి. అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పుల్లాయపల్లి, అగర్ల పెంట, సంగిడి గుండాల, మేడి మొలకల, ఈర్లపెంట, బౌరాపూర్, రాంపూర్, చెంచు గుడాలు ఉన్నాయి.
రవాణా సౌకర్యం ఉండదు రోడ్ మార్గం ఉండదు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తారు. కేవలం కాలినడక మాత్రమే సాధ్యమయ్య బాట ఉంటుంది. అప్పాపూర్ కేంద్రానికి రావడానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వైద్యం కోసం అప్పాపూర్ చెంచుపెంట నుంచి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారికి 10 కిలోమీటర్లు రావలసి ఉంటుంది. రోడ్డు మార్గం ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి మరో 5కిలోమీటర్లు ప్రయాణం చేసి వటవర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. ఇలా ఎన్నో అవస్థలు మధ్యన వైద్యం అందక చనిపోయిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అప్పాపూర్ లో వైద్య కేంద్రం తొలగించడం వల్ల చెంచులు వైద్యం కోసం మరెన్నో అవస్థలు పడుతున్నారు. అమ్రాబాద్, పదర, మద్దిమడుగు, ప్రాంతాలలో మరిన్ని చెంచుపెంటలు ఉన్నాయి. వర్షాకాలం లో సీజన్ వ్యాధులతో చెంచులు అవసరపడుతుంటారు. జిల్లా కలెక్టర్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పందించి కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తే చెంచులకు వైద్యం అందుతుంది.
ఆపద సమయంలో వైద్యం వండడం లేదు: గురువయ్య, మాజీ సర్పంచ్ అప్పాపుర్ 
ఆపద సమయంలో చెంచులకు వైద్యం అందడం లేదు. అప్పాపూర్ లో వైద్య కేంద్ర ఏర్పాటు చేయాలి. చెంచుల వైద్యం పట్ల ఐటిడి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్యాటకం పేరుతో పర్యటిస్తున్నారు కానీ చెంచులకు వైద్య సేవలు గురించి చర్చించడం లేదన్నారు.