ఇందల్వాయి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Collector who conducted surprise inspection of Indalwai PHC– విధులకు గైర్హాజర్ అయిన వైద్య సిబ్బందికి మెమోలు
– పీ.హెచ్.సీలలో ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ కు అదేశాలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అకస్మీకంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబ్ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపి, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్, పలు లోపాలను గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి, సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజర్ అయిన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని తన వెంట ఉన్న డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. ఔషధాలను శీతలీకరణలో ఉంచేందుకు ఉపయోగించే ఫ్రిడ్జ్ లను వినియోగించకుండా వృధాగా మూలన పడేయడాన్ని గమనించిన కలెక్టర్ పీ.హెచ్.సీ అధికారులను నిలదీశారు. ఒకవేళ ఫ్రిడ్జ్ లు చెడిపోతే తక్షణమే వాటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లాలోని అన్ని పీ.హెచ్.సీలలో ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. పీ.హెచ్.సీల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించారు. జ్వరంతో బాధపడుతున్న రోగులకు కచ్చితంగా రక్తపరీక్షలు చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆరోగ్య సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి ఒక్క డెంగ్యూ కేసును ఆశా కార్యకర్తచే డెంగ్యూ కేసు చుట్టూ 50 ఇండ్లలో సర్వే చేయించాలని స్ప్రే చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.ప్రతి సోమ, మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించాలని వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ కు తెలిపారు.