28న కలెక్టరేట్‌ ముట్టడి

– మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపు
– సమస్యలు పరిష్కరించాలి
– మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తక్షణం మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కన్వీనర్‌ ఎల్లేశ్‌ డిమాండ్‌ చేశారు లేకుంటే ఈ నెల 28న జిల్లా కలెక్టర్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డిని కలిసి మధ్యాహ్నం భోజన కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యల పరిష్కరించాలని సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ పథకంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2002లో ఈ పథకం ఆరంభం కాగా 2009 నుంచి కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం తోటే వెట్టి చాకిరి చేయిస్తున్నారని గుర్తు చేశారు. కానీ కనీస వేతనం అమలు చేయకపోగా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు కూడా సకాలంలో విడుదల చేయకపోవడం దారుణమన్నారు. 5 నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2000 పెంచారాన్నారు. అయినా సమయానికి బిల్లులు రాక జీతాలు రాక కుటుంబాలు గడవడం లేదన్నారు. అప్పు చేసి వంట వండి వడ్డించే పరిస్థితి ఏర్పడిందన్నారు. కిరాణా షాప్‌ లో కిరాణా సామాన్లు 4,5నెలలు ఉద్దెర ఇవ్వడం లేదన్నారు. తాము ఎట్లా వండి వడ్డించాలని ప్రశ్నించారు. నాలుగు నెలలు వేతనాలు, 5 నెలల బిల్లులు ఇవ్వాల్సి ఉందన్నారు.3 నెలల బ్రేక్‌ పాస్ట్‌ బిల్లులు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారించకపోతే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్‌ బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.