విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి

Collectorate siege on education issues– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు
– మెస్‌చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌

– అధికారులకు వినతులు
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్లను ముట్టడించారు. భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టళ్లుఅద్దె భవనంలో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలు నిర్మించాలని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
నవతెలంగాణ- విలేకరులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి నూతన కలెక్టరేట్‌ భవనం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయం గేటు ఎదుట బైటాయించారు. లోనికి అనుమతించాలని నినాదాలు చేయడంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్‌ ప్రియాంక అలాకు సమస్యలపై మెమోరాండం అందజేశారు.
నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌ హరిచందన దాసరికి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. విద్యారంగ సమస్యలపై అదనపు కలెక్టర్‌ భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌లో తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ తీసి, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌ రెడ్డి నేతృత్వంలో అధ్యక్షుడు లెనిన్‌ గువేరా, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య తదితరులు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి.. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు విజయేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ములుగు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ్‌, కుమ్మరి రాజు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌తోపుకు వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో, నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు.
పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి ఉప ముఖ్యమంత్రికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డైట్‌ బిల్లులు, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, విశ్వవిద్యాలయాలకు జూన్‌ నుంచి డైట్‌ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదని తెలిపారు. తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.7,200 స్కాలర్‌షిప్‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృహాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలకు మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌ ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. హాస్టళ్ల మరమ్మత్తుల భాధ్యతను గురుకులాల తరహాలో ఇంజినీరింగ్‌ శాఖకు ఇవ్వాలని సూచించారు. ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు నెలకు రూ.రెండు వేలు, పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు రూ.నాలుగు వేలు వృత్తి విద్యా, విశ్వవిద్యాలయ విద్యార్థులకు నెలకు రూ.ఐదు వేలు అందించాలని కోరారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వందెకరాల భూమిని హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్‌ 55ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.