– విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దిన దమ్మన్నపేట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్
– మిషన్- 100 పేరిట ప్రత్యేక కార్యక్రమం
– జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్వీకరించనున్న అవార్డు
– రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక కాగా, వారిలో ఒకరు జిల్లా ఉపాధ్యాయులు
నవతెలంగాణ – సిరిసిల్ల
విద్యార్థులే సొంతంగా వివిధ ఆవిష్కరణలు రూపొందించేలా తీర్చిదిద్దుతున్న జిల్లా ఉపాధ్యాయుడికి అత్యున్నత పురస్కారం దక్కనుంది. మిషన్ 100 అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎందరో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందేలా సిద్ధం చేసిన దమ్మన్నపేట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా వారిలో ఒకరు సంపత్ కుమార్. ఆయన ఎంపిక అవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు వెలికి తీసి, వారు ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన గంభీరావుపేట మండలం జిల్లా పరిషత్ దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తన ఛాంబర్లో అభినందించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలోనే కాకుండా అదనపు సమయంలో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ పిల్లల్లో భాష, గణిత నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని, ప్రభుత్వం కేటాయించిన సెలవులను వీలైనంత తక్కువగా వినియోగించుకోని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి అకింతభావంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు.
మిషన్- 100 అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి..
కనీసము 100 మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కర్తలుగా చేయాలనే సదుద్దేశంతో మిషన్- 100 అనే కార్యక్రమాన్ని సంపత్ కుమార్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 53 మంది విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. ఇందులో 8 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి, 16 మంది జాతీయస్థాయి బహుమతులు గెలుచుకున్నారు.
ఇవీ ఆవిష్కరణలు..
సంపత్ కుమార్ సర్ సారధ్యంలో విద్యార్థులు గైడ్ వెల్డర్లు కు ఉపయోగపడే హెల్మెట్ అనే ఆవిష్కరణ, జపాన్ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనందున రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీరిని అభినందించారు. ఇద్దరు విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు 2021, 2023 నందు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాయి. అలాగే వీరి గైడ్ చేసిన ఆవిష్కరణలు వరుసగా నాలుగు సార్లు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికయ్యాయి. వీరి మార్గదర్శనం లో విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు ఇండియా లో నిర్వహించే అన్ని వైజ్ఞానిక ప్రదర్శనల్లో జాతీయ స్థాయికి ఎంపికవడము విశేషం. విద్యార్థుల కొరకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వీరి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా సెప్టెంబర్ 5వ తేదీన అందజేయనున్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా విద్యాధికారి ఎ. రమేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య పాల్గొన్నారు.