– ఆరు గ్యారంటీలు, ధరణి,
– రైతుబంధు, భూసమస్యలపై చర్చ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త సర్కారు ఈనెల 21న కలెక్టర్ల సమావేశం కానుంది. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీనియర్ ఐఏఎస్‌లు, ఇతరులు ఈ సమావేశానికి కానున్నారు. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ఇందులో ప్రభుత్వ లక్ష్యాలు, అమలు, సర్కారీ యంత్రాంగం సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఆరు గ్యారంటీలపై కూడా చర్చ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం రూ. 10 లక్షలకు పెంచింది. వీటిని అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలుచేసినట్టుగా రేవంత్ సర్కారు ప్రకటించింది. అలాగే వందరోజుల్లో మిగతా గ్యారంటీల కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి వస్తున్న ఫిర్యాదులు భారీగానే ఉంటున్నాయి. భూములు, ధరణి, పౌరసరఫరాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రజావాణిలో అధికంగా వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు పథకాన్ని అమలుపై దిశ నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేస్తామని ప్రకటించిన రేవంత్, కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారా ? లేదా ఇంకొన్ని రోజులు వేచి చూస్తారా? అనేది తేలాల్సి ఉంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు ఢ అంటే ఢ అనేవిధంగా వ్యవహరించాయి. బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై సర్కారు రూపొందించిన గవర్నర్ ప్రసంగంపై అధికార, ప్రతిపక్షాలు వాడివేడిగా మాటల తూటాలు పేల్చుకున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, భవిష్యత్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఉండొచ్చనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇదిలావుండగా రైతుబందుపై మాట్లాడే ప్రధానంగా చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. రైతుబందుకు నిధులు విడుదల చేయాలని రేవంత్ సర్కారు ఆదేశించినా, నిధులు లేక పూర్తిస్థాయిలో అమలుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైనా చర్చించే అవకాశం లేకపోలేదు. ఆదివారం రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘరాంరాజన్‌తో సీఎం, ఇతర మంత్రులు, సీఎస్ భేటి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి, మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ అంశాలన్నీ ఈభేటిలో చర్చకు రానున్నాయి.