ప్రజల క్షేమమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం: కలెక్టర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించాలి.  ప్రజల అందరి క్షేమమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మండలంలోని ప్రాజెక్ట్ నగర్ వరద ముంపు గ్రామాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగు వరద ప్రవాహ ఉధృతి పెరిగే సమయంలో గృహాలను విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు. జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాలు జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా జరిగిన ప్రమాదాన్ని వరద ఉధృతి తీరును స్థానిక గ్రామస్తులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ముంపుకు గురైన గ్రామస్తులు తమకు నూతన గృహాలను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరగా వాటిపై అన్ని విధాలుగా అధికారులతో కూలంకషంగా  చర్చించి తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సరిగా కలెక్టర్ తమ గ్రామానికి రావడం తో ప్రాజెక్ట్ నగర్  గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను  సన్మానించారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట తహసిల్దార్ సుజన్ కుమార్, ఎంపీడీవో జవహర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.