కలెక్టర్లూ… బడులను తనిఖీ చేయాల్సిందే

Collectors... should check the schools– వారానికి రెండు పాఠశాలలు తిరిగి నివేదిక ఇవ్వాలి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు, ఉపాధ్యా యుల హాజరును వారు ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించింది. పాఠశాలల పర్యవేక్షణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వారానికి రెండు పాఠశాలలను తిరిగి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని కోరారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని నివేదికను రూపొందించాలని తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలకు ప్రత్యేకంగా టారులెట్లు ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించాలని కోరారు. అధికారులకు సమాచారం ముందే ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం. జాయింట్‌ కలెక్టర్లు, డీఈవోలు పాఠశాలల పర్యవేక్షణకు ఉన్నా కలెక్టర్లు తనిఖీ చేస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. దానివల్ల ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుందనీ, బోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఇంకోవైపు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు బడుల్లో ఉండే సమస్యల గురించి కలెక్టర్ల ద్వారా నివేదిక రూపంలో వస్తే వాటికి విలువ ఉంటుందనీ, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే ఆస్కారముంటుందని సీఎం భావిస్తున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలతో కలిపి 27,441 సర్కారు బడుల్లో 21,19,439 మంది విద్యార్థులు చదువుతున్నారు.