బెట్టింగ్‌లో కాలేజీ ఫీజు డబ్బులు

– రైలు కిందపడి బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య
నవతెలంగాణ-ఘట్కేసర్‌
కాలేజీలో కట్టాల్సిన ఫీజు డబ్బులను బెట్టింగ్‌లో పోగొట్టుకున్న బీటెక్‌ విద్యార్థి మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన కొండూరు శ్రీనివాస్‌ కుమారుడు నితిన్‌(21) పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌లో ఓ ప్రయివేటు హాస్టల్‌లో ఉంటూ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులు రూ. లక్షా 30 వేలను నితిన్‌కు పంపించారు. అయితే, నితిన్‌ ఫీజు చెల్లించకుండా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. అనంతరం అటు కళాశాలకు వెళ్లకుండా, పోగొట్టుకున్న డబ్బుల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం నితిన్‌ ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని యంనంపేట్‌ సమీపంలో ఖాజీపేట్‌ నుంచి సనత్‌నగర్‌ వైపు వస్తున్న గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.