బకాయిలు చెల్లించకపోవడంతోనే కళాశాలలు బంద్

Colleges closed due to non-payment of dues– కలెక్టరేట్ ఎదుట యాజమాన్యాల నిరసన
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా కళాశాలలు మూసే పరిస్థితికి వచ్చాయని ఆదిలాబాద్ జిల్లా ప్రయివేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడు హన్మండ్లు అన్నారు. ఆర్టీఎఫ్ నిధులు విడుదల చేయాలని గత మూడు రోజులుగా ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు బంద్ కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం మూడవ రోజు నిరసనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, బేలా, నెరడిగొండ, బోథ్ కళాశాలల నుండి యజమానులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ నిధులు చెల్లించాలని నినాదాలు చేస్తు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ శ్యామలదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ… ఫీజు రియంబర్స్ విడుదల చేయకపోవడంతో ప్రయివేట్ డిగ్రీ కళాశాల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా ఆర్టీఎఫ్ పెండింగ్ లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం టోకెన్స్ ఇస్తుందని కానీ బడ్జెట్ ఇవ్వడం లేదన్నారు. దీని కారణంగా కళాశాల నిర్వహణతో పాటు సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోతున్నామని, ట్యాక్స్, అద్దె ఇతర ఖర్చుల భారం తమపై పడుతుందన్నారు. 8 నెలల నుంచి ఆర్టీఎఫ్ కోసం వేచిచూస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు ఇచ్చేంత వరకు కళాశాలలను మూసి వేసి ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యల సంఘం కార్యదర్శి వరప్రసాద్, ప్రతినిధులు పున్నారావు, ప్రభాకర్ రెడ్డి, మహ్మద్ బిలాల్, నికేష్, క్రాంతి, గోపాల్ పాల్గొన్నారు.