– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
– చెరువుల కబ్జాలను ఉపేక్షిచం
– చట్ట వ్యతిరేక మైనింగ్‌ను అడ్డుకుంటాం
– ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు
– రూ.2లక్షల రుణమాఫీ నేటి నుంచి అమలు
– అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
20వేల ఎకరాల్లో గత ప్రభుత్వాలు స్థాపించిన ఫార్మా స్థానంలో కాలనీలు, విద్యాసంస్థలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కత నిశ్చయంతో ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. చెరువులు, కుంటల కబ్జాలను ఉపేక్షించబోమన్నారు. చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న మైనింగ్ ను అడ్డుకుంటామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తామని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నేటి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రేషన్ కార్డు లేని రైతులకూ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని గుర్తు చేశారు. రైతులు అపోహ చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అందుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లకు అందజేసిందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క పేదవాడికి ప్రభుత్వ ఇంటిని మంజూరు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. సొంత ఇంటి స్థలం కలిగిన పేదవాడికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునేందుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లె తప్ప గడచిన ప్రభుత్వం ఒక్క ఇంటిని మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వం 58, 59 జీవో తీసుకువచ్చి రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రభుత్వ భూముల అన్యక్రాంతానికి పాల్పడిందని విమర్శించారు. ఈ జీవో రంగారెడ్డి జిల్లాలో పని చేయకపోయినా అనేక మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిందన్నారు. 120 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు సొంత గహాన్ని నిర్మించేందుకు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచిన పింఛన్లు తప్ప అదనంగా లబ్ధిదారులను గుర్తించిన పాపాన గత పాలకులు పోలేదని విమర్శించారు. మరోవైపు గత పది సంవత్సరాల కాలంలో చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు రూ .6వేల కోట్ల వడ్డీని ప్రతినెల ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వేతన జీవులకు 20వ తారీకు వచ్చిన వేతనాలు చెల్లించే పరిస్థితి గతంలో ఉండేది కాదని, కానీ తాము ఒకటవ తేదీన అందజేస్తున్నామన్నారు. జిల్లాలో మైనింగ్ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగు తున్నాయని, వీటిని అడ్డుకుంటా మన్నారు. చట్టప్రకారం మైనగ్ ను అనుమతిస్తామని గుర్తు చేశారు. మరోవైపు యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 20వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫార్మాను రద్దుచేసి ప్రజా ఉపయోగ సంస్థలైన కాలనీలను, విద్యాసంస్థల వంటి పరిశ్రమలు నెలకొల్పుతున్నామన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు కబ్జాలు పాల్పడుతున్నారని అలాంటి వాటిని ఉపేక్షించబోమన్నారు. ఇప్పటికే తమ దష్టికి వచ్చిన అనేక చెరువులను పరిరక్షించామని చెప్పారు. ఇరిగేషన్ అధికారులను కూడా ముందస్తు చర్యగా ఎక్కడ అక్రమాలు జరిగినా ముందుగానే అడ్డుకోవాలని సూచించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేగంగా జరుగుతుందన్నారు. మొత్తం 13వేల దరఖాస్తులకు గాను ఇప్పటికే 7000 దరఖాస్తులను పరిష్కారం చేసినట్టు చెప్పారు. మరో 6,200 దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. పాస్ బక్కులు లేని, ఆధార్ లింకు గాని మరో అయిదు వందల దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకుపోయి పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. జూన్ 14వ తేదీ వరకు ఉన్న దరఖాస్తులు అన్నింటిని ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని సూచించారు. అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు.