కవి, కథకుడు, వక్త, సాహిత్య విమర్షకుడు డా||బద్దెపూడి జయరావు రచించిన వర్ణయుద్ధం కవితాసంపుటికి ప్రముఖ సాహిత్య విర్షకులు ఆచార్య రాచపాళెం చంద్రశేర్ రెడ్డి, షోషల్ ఇంజనీర్ బి.ఎస్.రాములు, దిగంబరకవి, కొయ్యగుర్రానికి కవిత్వ కాళ్ళుతొడిగిన మహాకవి నగముని లాంటి ఉద్దండులు డా||జయరావు వర్ణయుద్ధానికి ముందుమాటలు రాశారు.
కవి కారణజన్ముడంటారు పెద్దలు. కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు అంటారు పిరదౌశిలో మహాకవి గుఱ్ఱం జాషువాగరు. నిజమే గాడితప్పిన సమాజాన్ని తట్టిలేపేవాడు కవి కనుక అలాంటి విలువలతో కూడిన వ్యక్తి బద్దెపూడి జయరావు. అక్షరాలకు ప్రాణం ఉంటుందంటారు పెద్దలు. కొత్త నెత్తురు కవితా సంపుటి ద్వారా దానిని నిజం చేశాడు జయరావు.
విద్యార్ధిగా పరిశోధకుడుగా ఎత్తుకున్న ఇతివత్తం సామాన్యమైనది కాదు. దళిత సంఘటనలకు సంబంధించి పాటలు, ఎం.ఫిల్, దళిత సంఘటనాత్మక కవిత్వం పై పరిశోధన… అది అట్లుంచితే ఇప్పుడు మనం జయరావు వర్ణయుద్దం గురించి మాట్లాడుకోవాల్సిన సమయం కదా!? ఇందులో నలభై ఒక్క కవితలు ఉన్నాయి. ప్రతీ కవిత ఓ సజీవ సందేశం ఇస్తుంది. కష్టాలు, కన్నీళ్ళు, భాధలు, సమస్యలు బతుకే పోరాటమైన జీవితాల తాత్పర్యమే జయరావు వర్ణయుద్ధం. ఊరుమ్మడి బతుకుల్లో శ్రమజీవుల మధ్య కలంతో సమరం చేసి కష్టజీవుల ఆర్తనాదాలను తన కవిత్వంగా మలుచుకున్నాడు కవి.
”ఇది వివక్షతలపురిటిగడ్డ
వర్ణాదిపత్యంతో
విరుచుకుపడుతున్న వేదభూమి
కులాలతో కుళ్ళి కంపు కొడుతున్న
అసమానతలకు అడ్డా
నిషేదించబడిన మా వాడల్లో
వేల యేళ్ళుగా మరణమదంగం
మోగుతూనే ఉందం”టాడు కవి.
అంతటితో ఆగిపోలేదు. వాళ్ళు చదువుకున్న బడి గురించి, అమ్మ గురించి గొప్ప పదచిత్రాలను, దశ్యకావ్యాలను పాఠకలోకం ముందుకు తెచ్చాడ. మొత్తం కవి కవిత్వపు సారాంశం చూస్తే ఇప్పుడు మా అడుగులు రాజ్యాధికారం వైపు వేస్తున్నాం అంటాడు కవి. సామాజిక చైతన్యాన్ని, సామాజిక స్పృహను ఈ సమాజానికి అందించాడు కవి.
– ఎజ్రాశాస్త్రి, 8096225974