– నేడు 26వ వర్థంతి
– బండలేమూర్‌కు ప్రథమ సర్పంచ్‌గా బాధ్యతలు
– 1981-1988లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆధ్యుడు
– సీపీఐ(ఎం) డివిజన్ ప్రథమ కార్యదర్శిగా బాధ్యతలు
– అనేక భూపోరాటాలకు నాయకత్వం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పేద ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు కామ్రేడ్ పోచమోని జంగయ్య అస్తమించి నేటికి 25ఏండ్లు పూర్తయ్యాయి. నేడు ఆ పోరాట యోధుని 26వ వర్థంతి. జంగయ్య అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన వెట్టిచాకిరి విముక్తి, దున్నేవానికే భూమి అనే నినాదంతో సాగిన సాయుధ పోరాటంలో కామ్రేడ్ కృష్ణమూర్తి సహాచరుడిగా ముందుండి ఉద్యమించిన పోరాటయోధుడు. నిరంకుశ, రాజరికానికి వ్యతిరేకంగా, భూస్వాముల నిర్బంధ దోపిడీ, వెట్టి చాకిరిలో మగ్గుతున్న అభాగ్యులకు విముక్తి కల్పించాలని సాగిన వీరోచిత సాయుధ పోరాటమది. నిరుపేదలుగా, నిరక్షరాస్యులుగా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాన్య ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగిన పోరాటంలో వీర కిశోరులై ఉద్యమించారు. రాజరికాన్ని, భూస్వామ్య డోపిడీని సవాల్ చేసి విజయం సాధించిన చారిత్రాత్మక ఘట్టం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటంలో పోచమోని ముఖ్య భూమిక పోషించారు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన 4వేల మంది వీర కిషోరాలు తమ ప్రాణాలను బలిచ్చారు. ఆ సాయుధ పోరాటం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉవ్వెతున్న ఎగిసి పడుతున్న తరుణం. ఈ పోరాటానికి బండలేమూర్‌కు చెందిన పోచమోని జంగయ్య ఆకర్షితులై ఉద్యమ దారిపట్టారు. పూర్వం గొర్రెల కాపరిగా ఉంటూ, దోరల భూమిని కౌలుకు చేసుకుని సాగు చేసుకుంటుండేవారు. భూస్వాముల నిర్బంధ దోపిడీని, వెట్టి చాకిరిని ప్రతక్షంగా చూశారు. ఇక దాన్ని అంత మొందించాలనే ఆలోచనతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరుగుతున్న సాయుధ పోరాట ఉద్ధేశాన్ని, లక్ష్యాన్ని అర్థం చేసుకుని తుపాకి చేత పట్టి సాయుధ పోరాటంలో దూకారు. ఈ ప్రాంతంలోని భూస్వాములను ఎదిరించి భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమ నేతగా మారాడు. అక్షరం ముక్కరాని జంగయ్య ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత చదువు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను అవగతం చేసుకుని జీవితాంతం పేదల పక్షాన నిలిచి ధీరుడు జంగయ్య. భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారు. సాయుధ పోరాట విరమణ అనంతరం తను సీపీఐ(ఎం) తరుపున ఈ ప్రాంతంలో పార్టీని నిర్మించిన ముఖ్యుల్లో జంగయ్యది ప్రధాన భూమిక. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రథమ కార్యదర్శిగా పని చేశారు. ఆరుట్లకు అనుబంధమైన బండలేమూర్ 1981లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై 1988 వరకు పనిచేశారు. గ్రామాభివృద్ధి కోసం ఆహర్నీశలు శ్రమించారు. ఆ సందర్బంగానే గ్రామానికి రవాణా వ్యవస్థ ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్టీసీ బస్సు కల్పించారు. ప్రస్తుతం నారాయణపూర్ నడుస్తున్న బస్సు కల్పించాలన్న సంకల్పానికి రోడ్డు మార్గం వేసింది ఆయన నాయకత్వంలోనే. ఇక విద్యుత్, వ్యవసాయ బావుల త్వకాల వంటి సౌకర్యాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తదనంతర కాలంలో ఎన్ని వేర్పాటువాద ఉద్యమాలు వచ్చినా తను మార్క్సిస్టు పార్టీ పక్షాన నిలిచారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, పేదల పక్షాన నిలిచిన యోధుడు పోచమోని జంగయ్య. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎర్రజెండాకు వన్నె తెచ్చిన పోచమోని జంగయ్య 1997 ఆగస్టు23న అనారోగ్యంతో మృతి చెందాడు. నేడు ఆయన మహాయోధుని 26వ వర్థంతి. ఆయనకు బండలేమూర్ గ్రామకమిటీ ఘనమైన నివాళ్లులర్పిస్తుంది.