– మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే
– పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫ్లరు యాష్ స్కాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేసి చెప్తే, తాను బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నానని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఉదయం 11 గంటలకు అపోలో వెంకటేశ్వరస్వామి దేవాలయానికి తాను వస్తాననీ, మంత్రి పొన్నం కూడా అక్కడికి వచ్చి, ఫ్లరు యాష్ స్కాంలో డబ్బులు తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని అన్నారు. ఆరోజు మంత్రి గుడికి రాకుంటే, అదే సమయంలో అక్కడే మరికొన్ని నిజాలు బయటపెడతానని చెప్పారు. ప్రజలకు ఇవ్వాల్సిన చెక్కుల గడువు ఈనెల 27తో తీరిపోతున్నా, మంత్రి వాటి పంపిణీకి అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు. కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పద్ధతి ప్రకారం నడుచుకోవాలనీ, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటి వారికోసం బ్లాక్‌బుక్ ప్రిపేర్ చేశామనీ, ఇప్పుడు తప్పించుకున్నా, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తిప్పలు తప్పవని హెచ్చరించారు.