ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు రండి

– సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల 13 నుంచి జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఆహ్వానపత్రికను బుధవారం అందజేశారు. ఆలయ ఈవో, సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి, శేష వస్త్రాలతో సీఎంను సత్కరించారు. జానపదుల జాతరగా ఖ్యాతికెక్కిన ఐనవోలు మల్లన్న బ్రహ్మౌత్సవాల వైభవాన్ని, దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని, ఆలయ ప్రాశస్త్యాన్ని సీఎంకు అర్చకులు వివరించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్‌ నాగరాజు, టెస్కాబ్‌ చైర్మెన్‌ మార్నేని రవీందర్‌ రావు, ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్‌ రావు, ఏఈఓ కిరణ్‌కుమార్‌, ప్రధాన అర్చకులు రవీందర్‌ శర్మ, అర్చకులు నరేశ్‌ శర్మ, భానుప్రసాద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మౌత్సవాలకు దేవాదాయ, పోలీస్‌, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి, అగ్నిమాపక, ఆర్టీసి తదితర శాఖలు చేపడుతున్న పనుల వివరాలను అధికారులు మంత్రి కొండా సురేఖకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.