– టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి ఆయన పార్టీ నాయకులతో ఆయన జూమ్‌లో మాట్లాడారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మెన్లలతో ఆయన మాట్లాడారు. ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. మోజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏడాది పాలనపై ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారని అన్నారు. సోమవారం జరిగే ముగింపు ఉత్సవాల్లో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.
విగ్రహ రూపశిల్పి రమాణారెడ్డికి అభినందనలు
రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగహంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో అమరవీరుల పిడికిళ్లను జోడించడం స్పూర్తిదాయకమని కొనియాడారు.