– ఐసీసీ 2025 చాంపియన్స్ ట్రోఫీ
కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా): ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చాంపియన్స్, అగ్ర జట్టు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి కంగారూ జట్టులో ఇద్దరు కీలక పేసర్లు దూరం అయ్యారు. కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ జోశ్ హాజిల్‌వుడ్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్టు సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) అధికారికంగా వెల్లడించింది. పాట్ కమిన్స్ చీలమండ గాయంతో, జోశ్ హాజిల్‌వుడ్ హిప్ గాయంతో, మిచెల్ మార్ష్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ మేరకు సీఏ సెలక్షన్ కమిటీ చైర్మెన్ జార్జ్ బెయిలీ తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టు ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 12 ఆఖరు గడువు. జనవరి 13న ప్రకటించిన జట్టులో ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ కనీసం నాలుగు మార్పులు చేయాల్సి ఉంది. గాయాలతో కమిన్స్, హాజిల్‌వుడ్ సహా మిచెల్ మార్ష్ దూరం కాగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పోటీపడనున్న ఆస్ట్రేలియా.. ఫిబ్రవరి 12న ఆఖరు మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో సిరీస్‌కు ముగ్గురు సీమర్లను జట్టులోకి ఎంపిక చేశారు. సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, బెన్ సహా తన్వీర్ సంగా, ఆల్‌రౌండర్ కూపర్, బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌లు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతున్నారు.