భూమికోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల స్మారక సభలను నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దున్నేవాడికే భూమి నినాదంగా వ్యవసాయ విప్లవ పోరాటాలు సాగించాలని దేశ ప్రజానీకానికి భూమి, బుక్తి, విముక్తికి నూతన ప్రజాస్వామ్య విప్లవం మాత్రమే మార్గమని ఎలిగెత్తి చాటిందన్నారు. దేశంలో కొనసాగుతున్న అర్థవలస, అర్థ భూస్వామ్య దోపిడి వ్యవస్థను కూకటివేల్లతో సహా కూల్చివేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారం కావు అనేది దశాబ్దాల ఆచరణ రుజువు చేసిందిన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగిస్తూనే పాలకులు ముందుకు తెస్తున్న అభివృద్ధి నిరోధక దోపిడీ, అణిచివేత విధానాలపై సంఘటిత, సమరశీల, ఐక్య పోరాటలకు సంసిద్ధం కావాలని ప్రతిఘటన పోరాటాలకు మరింత పదును పెట్టుకొని ముందుకు సాగాలని, అమరవీరుల ఆశయాల బాటలో కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, అఖిల్, లక్ష్మణ్, రాజు పాల్గొన్నారు.