కథానాయిక సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలను అందించిన ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం.6గా దీన్ని నిర్మించనున్నారు. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. వెంకీ కుడుముల, కోన వెంకట్ ప్రొసీడింగ్స్ ప్రారంభిం చడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో ఈ సినిమా ఒక మిరాకిల్‌గా జరిగింది. సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి, నెక్స్ట్ డేకి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్‌లో ఇదే ఫస్ట్. అంత స్క్రిప్ట్ ఎగ్జైట్‌మెంట్ ఉన్న సినిమా ఇది. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాని చేయబోతున్నాం’ అని తెలిపారు. ‘ఈ కథ సంయుక్తకి ఎంతలా నచ్చిందని చెప్పడానికి ఉదాహరణ ఆమె ఈ సినిమాని ప్రెజెంట్స్ చేయడమే’ అని దర్శకుడు యోగేష్ కెఎంసి చెప్పారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ, ‘ఈ కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్‌గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను. కథ అద్భుతంగా ఉంది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ’ అని అన్నారు.