పౌరుల జీవించేహక్కులను హరించరాదు: కమిషనర్ కల్మేశ్వర్

– చట్టపరిధిలో పనిచేస్తే వి.డి.సి లకు సహకారం
– అనవసర చిక్కులలో పడరాదు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత
– గ్రామ అభివృద్ధి కమిటీలను తప్పుపట్టాలా..?
– చట్టవ్యతిరేకమైన చర్యలు సరికాదు: పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
నవతెలంగాణ – కంటేశ్వర్
చట్టం,హక్కులు,బాధ్యతలను ఎరుకజేసి,పౌరుల సామాజిక వెలివేతలు జీవించేహక్కులకు , సమానత్వానికి గొడ్డలపెట్టుల నిలవరాదని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో ఉద్భోధ చేసిన జిల్లాజడ్జి, పోలీస్ కమిషనర్ చట్టాల గూర్చి తెలిసిచేసిన , తెలియక చేసిన నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. చట్టపరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే న్యాయపరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్టపరిదిలో పనిచేస్తే  సంతోషమేనని కాని చట్టవ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కుల్లో చిక్కరాదనే అభ్యర్థనను అర్థం చేసుకుని మెలగాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.చట్టాలపై అవగాహన కోసమే సదస్సులని ఆ దిశగా న్యాయసేవ సంస్థ కృషి చేస్తున్నదని తెలిపారు.పల్లెల ప్రగతితోనే భరతావని వికాసమని అందుకు ప్రతి పౌరుడు  శ్రమించాలని కాని గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లాజడ్జి అన్నారు.నిజామాబాద్ పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కమిటీల పేరులలో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పు పట్టగలమా..అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడున్నదంటే అభివృద్ధి పేరున వేరొకరి అభివృద్ధిని ,సహజంగా జీవించేహక్కులను చెరిపి వేయరాదనే విషయాన్ని ప్రతివారు గౌరవించాలని తెలిపారు.కుల బహిష్కరణలకు పాల్పడడం,సామాజిక దండనలు ,వెలివేతలు చేయడంతో పోలీసుశాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో అందరు కలిసిమెలిసి జీవించడమే గీటురాయిగా ఉండాలని ఆకాంక్షించారు. చేసేపనులు చట్టవ్యతిరేకమైనవిగా ఉండరాదని, గ్రామ స్థాయిలో ఒక చట్టవ్యతిరేకమైన నిర్ణయం, తీర్మానం చేయరాదని అది అశాంతికి దారితీస్తుందని తెలిపారు. సమస్యలు ఉంటే ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకురావడం చేయాలని కోరారు. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే  చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.గ్రామ అభివృద్ధి ఆలోచనలు అమృతమే కావాలికాని విషతుల్యం కావద్దని,మా ఆలోచనలకు, భావనలకు ఆచరణరూపం ఇవ్వాల్సింది గ్రామ అభివృద్ధి కమిటీలేనని ఆయన అన్నారు. చట్టపరంగా ఉంటే సమస్య లేదు కాని చట్టవ్యతిరేకమైన చర్యలకు దిగిన ప్రోత్సహించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పొలీస్ కమిషనర్ పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయసేవ సంస్థ ను ఆశ్రయించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాఢ్యక్షుడు ఆశ నారాయణ, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు,వివిధ పోలీస్ స్టేషన్ ల అధికారులు పాల్గొన్నారు.