– ప్రిన్సిపాల్‌ను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో 142 మంది విద్యార్థునులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ కర్తార్ సింగ్‌ను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. హర్యాన రాష్ట్రంలోని జింద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలపైన పాఠశాల ప్రిన్సిపాల్ కర్తార్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడటం సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు చెప్పుకోలేని విధంగా మానసికంగా, శారీరకంగా లైంగిక వేధింపులకు గురి వేయడం అత్యంత పాశవికచర్య అని విమర్శించారు. విద్యా బుద్ధులు నేర్పి ప్రయోజకు లుగా తిర్చిదిద్దాల్సిన విద్యాలయంలో ఇటువంటి ఘటన జరగటం శోచనీయమని పేర్కొన్నారు. మహిళా కమీషన్లు, ప్రజాప్రతినిధులు ఈ విషయమై తగిన విధంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలు, బాలికలకు భద్రత లేదని తెలిపారు.