జమిలిపై కమిటీ

– మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో నియామకం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలోని రాజకీయ పార్టీలతోనూ, రాష్ట్రాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. అయితే లోక్‌ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, వెనుకగా 13 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరగవలసి ఉంటుంది. కేంద్రం తీరుతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుంది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం చట్టాన్ని తీసుకురావాలంటే శాసన పరిశీలన సంఘం ద్వారా సిఫారసులను పొందాల్సి ఉంటుంది. కానీ దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
రాష్ట్రాలను ఒప్పించాలి
లోక్‌సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరగవలసి ఉంది. కానీ ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్‌ శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల కన్నా ఐదు నెలల ముందుగానే జరగవలసి ఉంది. మరోవైపు హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగవలసి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటితోనూ సంప్రదించి, లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసన సభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించడం సాధ్యం కావచ్చు. కానీ మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. వీటిలో కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉంది. ఉదాహరణకు.. కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అస్సాం రాష్ట్రాల్లో 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ 15 రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు లేవు. కొన్నిటిలో బిజెపి, మరికొన్నిటిలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల్లో మెజార్టీ అవసరం
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. దీనికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అంతేకాకుండా దేశంలోని 50 శాతం రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. లోక్‌సభ సభ్యుల్లో 67 శాతం మంది, రాజ్యసభ సభ్యుల్లో 67 శాతం మంది మద్దతివ్వాలి.