నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాఠశాలలు, కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు బదిలీ, డిప్యూటేషన్, ఆన్ డ్యూటీ (ఓడీ) కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో కళాశాల విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్యా కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఇంటర్ విద్యా డైరెక్టర్ సభ్యులుగా ఉంటారనీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. బదిలీ, ఓడీ, డిప్యూ టేషన్ కోసం ఆ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫైరవీలకు తావులేకుండా సరైన కారణాలను చూపుతూ నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఏడాది మే, ఆగస్టు, నవంబర్ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ ఆయా నెలల్లో మూడో వారంలో సమావేశమై నిర్ణయం తీసుకుని అదే నెలలో 25వ తేదీలోపు సంబంధిత హెచ్‌ఓడీలకు ఆదేశాలను జారీ చేస్తుందని వివరిం చారు. కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా శాఖల ఉన్నతా ధికారులు బదిలీలు, ఓడీ, డిప్యూటేషన్‌పై చర్యలు తీసుకుంటారని తెలిపారు.