ఎస్సీ వర్గీకరణపై కమిటీలెన్ని వేసినా పరిష్కారం కాలేదు

– బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీలకు న్యాయం జరుగదు
– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ఎన్నో కమిటీలు వేసినా, చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీలకు న్యాయం జరుగదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకుని కమిట్‌మెంట్‌తో మాట్లాడారని చెప్పారు. 30 ఏండ్ల వర్గీకరణ పోరాటం ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నారు. హుషార్‌ మెహర్‌ కమిటీ పేరుతో కాలయాపన చేశారనీ, కమిటీ నివేదికను చదివే ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రధాని చేయలేదని ఆరోపించారు. సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ అవసరమనీ, అవసరం లేదని రెండు బెంచ్‌లు వేర్వేరు తీర్పులు చెప్పాయన్నారు. అక్టోబర్‌ 2న మాదిగ సామాజిక నేతలు కేంద్ర హౌం మంత్రి అమిత్‌షాను కలిశారన్నారు. ఎస్సీ వర్గీక రణకు కేంద్ర ప్రభుత్వం తరుపున సానుకూలంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు చెప్పామన్నారు. అక్టోబర్‌ 10న దానిపై సుప్రీం కోర్టు ధర్మాస నాన్ని ఏర్పాటు చేసిందనీ, డిసెంబర్‌ 14 వరకు అభ్యంతరాలు చెప్పాలని అందరికీ నోటీసులు సుప్రీం పంపిందని తెలిపారు. ఓట్ల రాజకీయం కోసం కాకుండా సామాజిక న్యాయం కమిట్‌మెంట్‌తో వర్గీకరణ చేస్తామన్నారు. బీసీ సంఘాలన్నీ బీజేపీ వైపు రావాలని పిలుపునిచ్చారు.