ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి

– దీపావళి తర్వాత అసెంబ్లీ భేటీ
డెహ్రాడూన్‌ : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుపై చర్చించి ఆమోదించేందుకు దీపావళి తర్వాత శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పించడం పైన, లింగ సమానత్వం పైన ఈ బిల్లు ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిసింది. అయితే యువతులకు వివాహం చేసుకునే కనీస వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలన్న ప్రతిపాదనను ఈ బిల్లులో చేర్చలేదు. యువతుల కనీస వివాహ వయసును 18 సంవత్సరా లుగానే కొనసాగించాలని ప్రభుత్వం నియమించిన కమిటీ సూచించింది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో అన్ని మతాల వారికీ ఒకే చట్టం వర్తించేలా చేయడమే ఈ బిల్లు ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివాహ రిజిస్ట్రేషన్‌, విడాకులు, ఆస్తి హక్కులు, అంతర్రాష్ట్ర ఆస్తి హక్కులు, భరణం, పిల్లల బాగోగులు వంటి వ్యక్తిగత చట్టాలు అందరికీ ఒకేలా ఉండేలా ఈ బిల్లులో ప్రాతిపాదించారు. అయితే ప్రతిపాదిత బిల్లు వివాహాలకు సంబంధించిన మత సంప్రదాయాల జోలికి పోలేదు. అలాగే ఇతర ఆచారాలను కూడా అందులో ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ ప్రసాద్‌ దేశారు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌ ఆమోదించే బిల్లును యూసీసీ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ నమూనాగా ఉపయోగించుకో వచ్చునని అంటున్నారు. కమిటీ తన నివేదికను సమర్పించిన వెంటనే యూసీ సీని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ గతంలోనే చెప్పారు. దంపతులకు ఉండాల్సిన పిల్లల విషయంలో అన్ని మతాలకూ ఒకే నిబంధన ఉండాలని పలు సూచనలు వచ్చినప్పటికీ దీనిపై కమిటీ ఎలాంటి సిఫార్సు చేయలేదు. యూసీసీ అమలుపై బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ కూడా కమిటీలను ఏర్పాటు చేశాయి. జాతీయ స్థాయిలో లా కమిషన్‌ ఇప్పటికే దీనిపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.