– దేశంలో ఇంకా సంపూర్ణ స్వాతంత్య్రం రాలేదు
– వామపక్ష పార్టీల ఐక్యతతో అధికారం చేపట్టే ఆవశ్యకత ఉంది : సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో చాడ, పల్లా
నవతెలంగాణ -అబ్దుల్లాపూర్ మెట్
వర్గరహిత సమాజ నిర్మాణమే కమ్యూనిస్టు సిద్ధాంతమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, పార్టీ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేటలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సభాధ్యక్షులుగా ముత్యాల యాదిరెడ్డి, పబ్బతి లక్ష్మణ్ వ్యవరించారు. సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్గరహిత సమాజ నిర్మాణం, ఆత్మగౌరవం పోరాటం, దున్నేవాడికే భూమి అనే సిద్ధాంతాల కోసం సీపీఐ పోరాడుతుందన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సుమారు 4,500 మంది కమ్యూనిస్టు నాయకులు ఆత్మబలి దానాలు చేసి సుమారు పది లక్షల వేల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల సంక్షేమ కోసం సీపీఐ పనిచేస్తుందని తెలిపారు.
అమరవీరుల ఆశయ సాధనలో నిరంతరం పయనిస్తూ ఏనాటికో ఓ నాటికి పార్లమెంట్‌పైన సీపీఐ జెండా ఎగరేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వామపక్ష పార్టీల ఐక్యతతో అధికారం చేపట్టే ఆవశ్యకత ఉందన్నారు. పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రేవంత్ సర్కారు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని, తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని, వాళ్లపై పెట్టిన కేసులను ఎతి వేయాలని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇబ్రహీం పట్నం మాజీ శాసనసభ్యులు సీపీఐ సీనియర్ నాయకులు కోండి గారి రాములు, సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు సామిటి శేఖర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్మీర్ హరిసింగ్ నాయక్,వేణుగోపాల్ చారి, కాటి అరుణ, పట్టినవనీత ,కేతరాజు నరసింహ తగిలి మధు, యేశాల నరసింహ, దాసరిప్రసాద్, పొన్నాల యాదగిరి పాల్గొన్నారు.