– నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
– నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.శంకరయ్య ఇకలేరు. సీపీఐ(ఎం) వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 102 ఏండ్ల శంకరయ్య జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ మూడు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నైలోని బసంత్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు సంతానం తెలిపారు.
ప్రజలు, కమ్యూనిస్టు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని క్రోంపేట్ న్యూకాలనీలోని శంకరయ్య నివాసం వద్ద, సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కమిటీ కార్యాలయం, టి.నగర్‌లోని పి.రామమూర్తి స్మారక చిహ్నం వద్ద ఉంచారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగ ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్, సీనియర్ నాయకుడు టికె రంగరాజన్, కేంద్ర కమిటీ సభ్యులు ఎ.కె.పద్మనాభన్, పి.షణ్ముఖం, యు.వాసుకి తదితరులు ప్రియతమ నేతకు నివాళులర్పించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మంత్రులు దురై మురుగన్, కె పొన్ముడి, ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీలు టిఆర్ బాలు, ఎ.రాజా, సీపీఐ సీనియర్ నాయకుడు ఆర్ నల్లకణ్ణ, ఎండిఎంకె నేత వైగో, వీసీకే ఎంపీ తిరుమవలవలన్, సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్, వివిధ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖలు శంకరయ్యకు నివాళులర్పించారు.
ఆయన జీవితం సోషలిజం కోసం అంకితం: సీతారాం ఏచూరి
”ఎన్ శంకరయ్యకు లాల్ సలాం. ఎన్ శంకరయ్య, భారత కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకుల్లో ఒకరు. మార్క్సిస్ట్-లెనినిస్ట్‌గా, ఆయన తన జీవితాన్ని దేశ సోషలిస్ట్ పరివర్తనకు అంకితం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు ప్రగాఢ సానుభూతి” అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమం మార్గదర్శిని కోల్పోయింది: డి.రాజా
”ఎన్ శంకరయ్య మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం సమర్థుడైన మార్గదర్శిని కోల్పోయింది” అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు.
శంకరయ్య జీవితం
శంకరయ్య 1922లో జులై 15న ట్యూటికోరిన్‌లోని కోవిల్‌పట్టిలో జన్మించారు. ఆయన భార్య నవమణి. శంకరయ్యకు ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, నరసింహన్ (సీపీఐ(ఎం) దక్షిణ చెన్నై జిల్లా కమిటీ సభ్యుడు), కుమార్తె చిత్ర ఉన్నారు. శంకరయ్య జూలై 2021లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
మెట్రిక్యులేషన్ తరువాత శంకరయ్య 1937లో మదురైలోని అమెరికన్ కాలేజీలో చరిత్రను అభ్యసించారు. మద్రాసు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులలో ఒకరు. మదురై స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆయన దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. మదురైలోని అమెరికన్ కాలేజీలో హిస్టరీ స్టూడెంట్‌గా ఉన్న శంకరయ్య తన చివరి పరీక్షలకు ముందు 1941లో మొదటిసారి అరెస్టయ్యారు. దీంతో ఆయన డిగ్రీ పొందలేకపోయారు. 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం లభించే ముందు రోజు విడుదలైన అనేక మంది కమ్యూనిస్టులలో శంకరయ్య ఒకరు. మొదటి సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. శంకరయ్య రాజకీయ జీవితం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. దాదాపు ఎనిమిదేండ్ల జైలు పాటు శిక్ష అనుభవించారు. ఆయన బ్రిటిష్ పాలనలో ఎకె గోపాలన్, కామరాజ్ వంటి సీనియర్ నాయకులతో పాటు అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. కయ్యూరు సహచరులను ఉరితీసే సమయంలో శంకరయ్య కూడా కన్నూరు జైలులో ఖైదీగా ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో సీపీఐ(ఎం) హైదరాబాద్ పార్టీ అఖిల భారత మహాసభ ఎర్ర జెండాను పట్టుకుని పోరాట, రాజకీయ జీవితాన్ని నడిపించిన విఎస్ అచ్యుతానంద్, శంకరయ్యలను ఘనంగా సన్మానించింది.
1964 ఏప్రిల్ 11న జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ ఛైర్మన్ ఎస్‌ఎ డాంగే, ఆయన అనుచరుల తీరును నిరసిస్తూ, ”ఐక్యతకు వ్యతిరేక, కమ్యూనిస్ట్ వ్యతిరేక విధానాలు” అనుసరిస్తున్నారని పేర్కొంటూ వాకౌట్ చేసిన 32 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులలో శంకరయ్య ఒకరు.
తరువాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు . సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడుగా, ఎఐకెఎస్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.
1995 నుంచి 2002 వరకు సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యే
శంకరయ్య 1967లో మదురై పశ్చిమ నియోజకవర్గం నుండి, 1977, 1980ల్లో మధురై తూర్పు నియోజకవర్గం నుంచి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన 1977, 1980లో అసెంబ్లీలో సీపీఐ(ఎం) పక్ష నాయకుడిగా ఉన్నారు.
నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్ కామ్రేడ్ శంకరయ్య మృతికి పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ సీపీఐ(ఎం) నేత, పాత తరానికి చెందిన కమ్యూనిస్టు నేతల్లో ఒకరైన కామ్రేడ్ ఎన్.శంకరయ్య మృతి పట్ల పార్టీ పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. కమ్యూనిస్టు రాజకీయాలను, విధానాలను ప్రజలకు సమర్ధవంతంగా వివరించే మంచి వాగ్ధాటి గల వక్త శంకరయ్య అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అంకిత భావం, నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్ అని వ్యాఖ్యానించింది.
పార్టీకి పూర్తిగా అంకితమైన ఆయన ప్రజా జీవనంలో సమగ్రత, నిరాడంబరతలకు సంబంధించి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆయన మృతితో కమ్యూనిస్టు ఉద్యమం అద్బుతమైన చరిత్ర కలిగిన నేతను కోల్పోయిందని పేర్కొంది.
ఆయన లేకపోయినా ఆయన వారసత్వం నిలిచివుంటుందని వ్యాఖ్యానించింది. శంకరయ్యకు ఘనంగా నివాళి అర్పించిన పొలిట్‌బ్యూరో వారిద్దరి కుమారులకు, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేసింది.
మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు: ఎంకె స్టాలిన్
”కామ్రేడ్ శంకరయ్య చాలా చిన్న వయస్సులో ప్రజా జీవితంలో దిగి, 102 సంవత్సరాల వయసు వరకు భారతదేశం, కార్మిక వర్గం, తమిళుల భూమి కోసం జీవించారు. ఆయన త్యాగం తమిళనాడు చరిత్రలో నిలిచిపోతుంది. ”తన జీవితాన్ని ప్రజా సేవలోనే గడిపారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన, స్వాతంత్య్ర సమరయోధుడు. శంకరయ్యకు నివాళి. తమిళనాడుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర గౌరవాలతో ఆయనకు వీడ్కోలు పలుకుతాం” అని ఎంకె స్టాలిన్ తెలిపారు.
కార్మిక-కర్షక ఉద్యమానికి తీరని లోటు: పినరయి విజయన్
”ఎన్. శంకరయ్య మరణం దేశంలోని కార్మిక-కర్షక ఉద్యమానికి తీరని లోటు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీపీఐ(ఎం) వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా, రైతాంగ ఉద్యమ నాయకుడిగా ఆయన వారసత్వం మనందరికీ సోషలిస్టు సమాజాన్ని సాకారం చేసేందుకు పోరాటాల నిర్మాణంలో దృఢంగా నిలబడేలా స్ఫూర్తినిస్తుంది. వీడ్కోల్ లాల్ సలామ్, కామ్రేడ్” అని పినరయి విజయన్ తెలిపారు.