– భువనగిరి నియోజకవర్గంపై కమ్యూనిస్టులకే అవగాహన
– వామపక్షాల పోరాట ఫలితమే ఉపాధి హామీ చట్టం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశం
– హాజరైన భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్
– మతోన్మాదాన్ని ఎదుర్కొని లౌకికత్వాన్ని కాపాడుతాం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజా సమస్యలపై కొట్లాడేందుకు పార్లమెంట్‌లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి ఎదుర్కొని, లౌకికత్వాన్ని కాపాడుతామన్నారు. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం ఇబ్రహీంపట్నంలోని పాషా-నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్, జాన్‌వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉందన్నారు. నకిరేకల్, భువనగిరి, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మునుగోడు నియోజకవర్గాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. ఈ ప్రాంతం నేటికీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కలిగి ఉందన్నారు. భూ పోరాటాలతో పాటు తాగు, సాగు నీటి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. భువనగిరి పార్లమెంటు సరిహద్దులు ఇతర పార్టీల అభ్యర్థులకు తెలుసా అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో ఏనాడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పోరాటాలు చేశాయా అని నిలదీశారు. గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని సాధించుకున్నామన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సాధించుకున్నామన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ చట్టాలను తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సరైన పంథాలో పోరాటాలు నిర్వహించడం లేదని విమర్శించారు. లౌకిక విలువలను కాపాడటంలో విఫలమైనదన్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిందన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. అభ్యుదయవాదులకు, అవకాశవాదులకు మధ్య ఈ పోటీ జరుగుతున్నదన్నారు. డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారని ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు వెనుకబడుతున్నాయన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇచ్చినా కనీస వసతులు కల్పించడం లేదని, 44 డిపార్ట్‌మెంట్లు ఉంటే 20 డిపార్ట్‌మెంట్లు మాత్రమే పని చేస్తున్నాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో పాటు ముందు మూసీని శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందన్నారు. ఆ పోరాట వారసత్వం కలిగిన కమ్యూనిస్టు అభ్యర్థిగా తాను ప్రజల ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆదరించి, అభిమానించి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కడిగల్ల భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, జగదీష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యాదయ్య, సామెల్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.