– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– నల్లగొండ జిల్లా కేతేపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-కేతెపల్లి
ప్రభుత్వాల్లో అస్థిరత, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు కమ్యూనిస్టు పార్టీని కోరుకుంటున్నారని, దానికి నేడు శ్రీలంకలో కొలువుదీరిన కమ్యూనిస్టు ప్రభుత్వం నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలకేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి పేరు మీద నూతనంగా నిర్మించిన సీపీఐ(ఎం) కార్యాలయ (ఎన్‌ఎస్‌ఆర్) భవనాన్ని ఆదివారం తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి మత రాజకీయాలను ప్రేరేపిస్తున్నదని అన్నారు. పన్నుల రూపంలో ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు దారపోస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళనలో ఇండ్లు, భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు ప్రత్యామ్నాయ వనరులు కల్పించాలని కోరారు. సామాన్య ప్రజల హక్కులకు పాలక ప్రభుత్వాలు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని గమనించి పరిపాలన చేయాలని సూచించారు. లగచర్ల ఘటనలో రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, రైతురుణమాఫీ, రైతుభరోసా పక్కగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరల గడీలను బద్దలు కొట్టి వారి ఆస్తులను పేదలకు పంచిన మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి పేరు మీద కార్యాలయం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, సీనియర్ నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.