ప్రజలకు రక్ష కమ్యూనిస్టులే…

ప్రజలకు రక్ష కమ్యూనిస్టులే... – ప్రజాసమస్యల్ని చట్టసభల్లో లేవనెత్తేది వారే
– అలాంటి నేతలను చట్టసభలకు పంపండి
– పోరాటగడ్డలే విప్లవకారులకు యాత్రాస్థలాలు
– పాలేరులో తమ్మినేని వీరభద్రంను గెలిపించండి: సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఖమ్మం జిల్లా ఎమ్‌.వెంకటాయపాలెం నుంచి అచ్చిన ప్రశాంత్‌
ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమ్ముడుపోకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నికరంగా కొట్లాడేది కమ్యూనిస్టులేననీ, అందుకే పాలేరు ఎమ్మెల్యేగా తమ్మినేని వీరభద్రాన్ని గెలిపించాలని సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీరులగన్న పోరాట గడ్డలే విప్లవకారులకు తీర్థయాత్రా స్థలాలని ఆయన చెప్పారు. అలాంటి గడ్డ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం రూరల్‌ మండలంలోని ఎమ్‌.వెంకటాయపాలెంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఏచూరి మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ, ప్రజా పోరాటాలను చీల్చడానికి మతోన్మాద రాజకీయాలను బీజేపీ ముందుకు తీసుకొస్తున్నదని విమర్శించారు. యూపీలో బీజేపీ బుల్డోజర్‌ పాలన కొనసాగిస్తున్నదన్నారు. మణిపూర్‌లో పెద్ద ఎత్తున హింస జరుగుతుంటే మోడీ ఒక్కసారి కూడా వెళ్లలేదన్నారు. మణిపూర్‌ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మోడీపైన లేదా? అని ప్రశ్నించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటే ఇదేనా? అని నిలదీశారు. దేశంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కొత్త భారతాన్ని నిర్మించవచ్చునని చెప్పారు. కుల గణన చేయకుండా మోడీ సర్కారు మొండికేస్తున్నదని విమర్శించారు. బీహార్‌లో గణన చేస్తే 85 శాతం దళితులు, గిరిజనులు, ఓబీసీలున్నారని తేలిందనీ, ఇప్పుడు అక్కడ ఆ ప్రజలకు రిజర్వేషన్లు పెంచే పనిలో ఆ ప్రభుత్వం ఉందని చెప్పారు. దేశ సంపదకు యజమానులు ప్రజలేననీ, మన తెలియకుండానే ఆస్తులను అమ్ముకుంటున్న మేనేజర్‌(మోడీ)ను మార్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నేతలపై ఆధారపడి నడిచే పార్టీల కంటే సిద్ధాంతపరంగా ముందుకెళ్లే కమ్యూనిస్టులనే ప్రజలు ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో సీట్లు రాకపోయినా తమ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందంటూ బీజేపీ చెప్పడం వెనుక కొనుగోళ్లపర్వం దాగుందని చెప్పారు. మోడీ తన మిత్రులకు లబ్ది చేకూరుస్తూ వారి దగ్గర నుంచి ధనశక్తిని తీసుకుని ఎమ్మెల్యేలను కొంటూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గోవా, మహారాష్ట్రలో గతంలో జరిగిన ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ.. పాలేరు గడ్డమీద సీపీఐ(ఎం) జెండా ఎగురబోతున్నదని నొక్కిచెప్పారు. దళితులు, రైతులు, ఆశాలు, అంగన్‌వాడీల కోసం తమ్మినేని నికరంగా నిలబడ్డారని అన్నారు. ఖమ్మంలో 2004లో వచ్చిన ఫలితమే ఇప్పుడు పాలేరులో పునరావృతం కాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు ఆకలితో చనిపోతే ఎన్నడైనా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారి ముఖం చూశారా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆయనకు ఎందుకు ఓటేయాలి..? అని అడిగారు. వ్యక్తి చనిపోతే రూ.5వేలు, రూ.10 వేలు ఇవ్వడం కాదు కుటుంబాలు గౌరవంగా బతికేలా చూడాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో బతకాలని కోరుకునే వ్యక్తి తమ్మినేని, ఆయన కూలీరేట్లు పెంచడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కేరళలో ప్రతిపేదకూ 7,40,000 ఇచ్చి ఇల్లు కటిస్తున్న ఘనత కమ్యూనిస్టు ప్రభుత్వానిదేనని అన్నారు. క్వింటా ధాన్యానికి కేంద్రం ఇచ్చే రూ.2,000కు మరో 700 కలిపి రూ.2,700 చేసి రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఘనత వామపక్ష ప్రభుత్వానిదేనన్నారు. కేరళలో రోజు కూలి రూ.850 ఇస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో ఆరేండ్లలో 2,70,000 ఉద్యోగాలిచ్చామని చెప్పారు. అక్కడ నూటికి 96 శాతం మంది ప్రజలకు భూమి ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ భూమి ఇవ్వాలి లేకుంటే అరకలు కడుతామంటూ తమ్మినేని అసెంబ్లీలో తన వాణిని వినిపిస్తారని తెలిపారు. పినపాకలో ఎమ్‌ఎల్‌ పార్టీకి, కొత్తగూడంలో సీపీఐకి మద్దతునివ్వాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు.
పాలేరు అభ్యర్థి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… తమ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓటుకు రూ.3 వేల చొప్పున పంచుతున్నాయనీ, ఎన్నిక రోజు మరో రూ.2వేలు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. సీపీఐ (ఎం) ఒత్తిడి వల్లనే రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారని తెలిపారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశాననీ, తన పోరాటానికి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి దిగివచ్చి రూ.600 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.
ఎస్సీ సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకురావడానికి చేపట్టిన సైకిల్‌ యాత్రను ప్రస్తావించారు. ఆ పోరాట ఫలితంగానే నేడు దళిత కాలనీలకు రోడ్లు, అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని గుర్తు చేశారు. డబ్బులు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఖమ్మం జిల్లా సాగునీటి జలాల కోసం నికరంగా కొట్లాడుతున్న కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్నభోజన కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌ కావడంలో తమ పోరాటాలు కీలకమన్నారు.
అందువల్ల ఆయా తరగతుల ప్రజానీకమంతా ఎర్రజెండాకు ఓటేసి గెలిపించాలని కోరారు. తద్వారా పోరాడేవారికి ఆయుధమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల తరపున పోరాడేందుకోసం తనకు ఎమ్మెల్యే పదవి అనే పదునైన కత్తినివ్వాలని కోరారు. అధ్యక్ష్యా… పాలేరు గోస ఇది అని ఉపేందర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారా? లోక్‌సభలో ఖమ్మం ఎంపీగా పొంగులేటి జిల్లా సమస్యల్ని ఏనాడైనా ప్రస్తావించారా..? అని నిలదీశారు. వారికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదన్నారు. అందువల్ల వారు వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నుంచి ఏడో గ్యారంటీ కావాలి..’అదే పార్టీ మారననే హామీ…’ అని తమ్మినేని ఈ సందర్భంగా చురకలంటించారు. బహిరంగ సభలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కూడా ప్రసంగించారు. సభకు నండ్ర ప్రసాద్‌ అధ్యక్షత వహించారు.