మిరప మహేష్ ‘పడమటీది నాటకం’ అనే పేరుతో ఈ మధ్య కాలంలో కవితా సంపుటిని వెలువరించారు. ఇది రెండవ కవితా సంపుటి. వీరి మొదటి కవితా సంపుటి ‘బువ్వకుండ’. ఈయన కాకినాడ ప్రాంతానికి చెందినవారు. వీరు రాసిన చాలా కవితలు బహుమతులను పొందాయి. వివిధ పత్రికలలో అచ్చయి చాలామంది దష్టిని ఆకర్షించాయి. వారి రెండవ కవితా సంపుటిలోని ‘అమ్మ తోడు’ కవితను ఈ కాలమ్ లో పరిశీలిద్దాం.
‘అమ్మ తోడు’ అనే శీర్షిక అమ్మకు సంబంధించిన కవిత కావచ్చు అనేంతగా మనల్ని ప్రభావితం చేస్తుంది కానీ ఇది అమ్మకు సంబంధించిన కవిత కాదు. మనం జనవ్యవహారంలో వాడే పదబంధం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒట్టు పెడుతూ ఆ విషయం పట్ల తనకున్న ధీమాను వ్యక్తం చేసే సందర్భంలో దీన్ని వాడుతాం. ఆ పదబంధాన్ని శీర్షికగా పెట్టడంతో కవి కవిత పట్ల ఉత్సుకతను రేపాడు.
అమ్మ గూర్చి కాకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఎత్తుగడలోనే తెలియజేశాడు. మొదటి వాక్యం చదివితే జీవితం గురించి, జీవితచట్రంలో ఇరుక్కుని సాధకబాధకాలను అనుభవిస్తున్న సామాన్య మానవుడి గురించి రాస్తున్నాడని అర్థమవుతుంది. సంసార బంధనాలలో చిక్కుకున్న మనిషి కానొస్తాడు. శ్రమ చేసి తగిన ఫలాన్ని పొందలేని శ్రామికుడు గుర్తుకు వస్తాడు. ఈ కవిత ఇంకా చాలా పార్శ్వాలలోకి చూడదగినట్టుగా ఉంటుంది.
రెండవ స్టాంజాలోని ‘వంతులాట’ అనే పదం తరతరాలుగా అనుభవిస్తున్న స్థితిని తెలియజేస్తుంది. వ్యవస్థలలో కానీ, జీవితయానంలో కానీ బరువు మోసే వ్యక్తులు కొందరే ఉంటారు. వారి దుఃఖాన్ని వారే మోసుకు తిరగాలి తప్ప ఎవరూ ఓదార్పునివ్వరు. కవి కూడా ఆ కోణంలోంచే అటువంటి వ్యక్తుల గూర్చిన విషయాన్ని కవిత్వమయం చేశాడు. కవి బాధ్యత కూడా అదే. బాధితుల పక్షాన నిలబడటమే. ఈ కవి కూడా బాధితుల పక్షమే.
మూడవ స్టాంజాలోని పగలు, రాత్రులను జీవితానికి సంబంధించిన వెలుగు, చీకట్లుగా భావించుకోవచ్చు. వెలుగును కష్టపడకుండా అనుభవించే వారికి ప్రతీకగా చెబుతూ చీకటిని ఎంత కష్టం చేసినా ఆనందాన్ని అనుభవించని వ్యక్తులుగా కవి పేర్కొన్నాడు. కష్టించేవాడు త్యాగజీవి. ఇతరుల మేలుకొరకే తను జీవిస్తుంటాడు. అతనికి కవి ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు.
కవిత నిర్మాణంలో ఒక్కో స్టాంజా ఎత్తుకున్న మూలాంశం నుండి గాడి తప్పకుండా సాగుతుంది. కవితను నడిపించిన తీరు మెచ్చుకోదగినది. కొన్ని కవితల్లో కవులు మూలాంశం నుండి జరిగి మళ్లీ ముగింపులోకి వచ్చి గుంపులో గోవిందంలా కలుపుతారు. ఈ కవి ప్రత్యేకత వేరు. ఈ కవితలో తక్కువ పంక్తుల్లో ఎక్కువ సారాన్ని పట్టుకు రాగలిగాడు.
కవి తోటను, పూలను ప్రతీకలుగా చేసుకొని తోటను కొంత కరుణ గల దానిగా చిత్రించాడు. కవి తన వాక్యాల ద్వారా కొన్నిసార్లు పాఠకుడిని కలవర పెట్టొచ్చు. సంతప్తి పరచొచ్చు. ఇక్కడ కవి ఊహ సరిగ్గా సరిపోతుంది. కష్టపడే వారిని, త్యాగం చేసేవాడిని గుర్తించాలన్న ఆరాటం ఈ కవితలో కనపడుతుంది. అలాంటి శ్రమజీవులను, త్యాగజీవులను స్వార్థంతో కాకుండా మంచి హదయంతో గుర్తించి వారికి తోడు నిలవాల్సిన సమయాన్ని ఈ కవిత గుర్తుచేస్తుంది.
ప్రత్యేకించి చెప్పాలంటే ఇది ‘శ్రమజీవుల తోడు’గా చెప్పుకునే కవిత.
అమ్మ తోడు
ఇక్కడ జీవితం
అసంపూర్ణ వాక్యం
ఎవరో విడిచిపెట్టిన కాలాన్ని
కావడి మోతలా
మనం పూర్తి చేయడమే
ఇది వంతులాట
ఆట చివరన దక్కేది
ఒక్కో దుఃఖచెలమ
అది సంకల్పితమో
అసంకల్పితమో
సాంద్రతలోనే తేడా
కొందరిది పగలైతే
మరికొందరిది రాత్రి మాత్రమే
రోజంతటినీ ఆస్వాదించిన
నిండు జీవితాలెన్నో
సమాధులనడగాలి
వాడిపోయే పూల జాతకం
తోటకు తెలుసునేమో గాని
నీ కథ ముగింపు జాడ మాత్రం
అమ్మ తోడు
ఎవ్వరికీ తెలియదు
– మిరప మహేష్
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551