2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమివ్వాలి

2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమివ్వాలి– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు
నవతెలంగాణ-నారాయణఖేడ్‌ రూరల్‌
నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ రహదారి వెడల్పు పనుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అతిమెల మాణిక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాణిక్‌ మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నిజాంపేట్‌, నారాయణఖేడ్‌, మనూర్‌ మండలాల్లో వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారన్నారు. భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇస్తామని మాత్రమే అధికారులు చెబుతున్నారని.. దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నార న్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, మార్కెట్‌ ధరకు మూడు వంతుల రెట్టింపు ఇవ్వాలని కోరారు. లేదా భూమికి భూమికి, ఇల్లు పోతే వేరే చోట స్థలం కేటయించి ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలన్నారు.