
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల కాపురం బ్లాక్-1ఓసీపీకి 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న సుమారుగా 2,800 ఇండ్లకు,భూములకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇస్తూ, సురక్షితమైన ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేయాలని సోమవారం తాడిచెర్ల భూ నిర్వాసితులు ఓసీపీ మైన్ లో ఆందోళన,నిరసన చేపట్టారు. నిర్వాసితులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయిన నిర్వాసితులు మైన్ లోకి వెళ్లి బైఠాయించారు.ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు. ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు టిఎస్ జెన్కో కంపెనీ ఇంటి నెంబర్లు కేటాయించి,14-12-2022న పలు దినపత్రికల్లో ప్లినిమరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇట్టి నోటిఫికేషన్ కాలపరిమిది 12 నెలలు మాత్రమే కానీ రెండు నెలలు కాలపరిమితి ఉండగానే సంబంధించిన జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకవెళ్లినట్లుగా తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్ జెన్కో కంపెనీ అధికారులు ఇంకా డబ్బులు వేయలేదని చెప్పడం జరిగిందన్నారు. తాడిచెర్ల ఓసిపిలో బ్లాస్టింగ్ బాంబుల దెబ్బలతో ఇండ్లు నెలమట్టమై, ఇంటి గోడలు భారీగా పగుళ్లు తెలుతున్నాయని, బ్లాస్టింగ్ వల్ల రసాయన విషపు వాయువుతో ప్రజలకు ఊపిరితిత్తుల,క్యాన్సర్,గుండె జబ్బులు తదితర వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా నిర్వాసితుల సమస్యలను పరిస్కారమార్గం చూపేలా చర్యలు తీసుకోవాలని జెన్కో ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు.