అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి

– తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈదురుగాలులు, వడగండ్ల వానతో వరంగల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొక్కజొన్న, వరి, జొన్న, మిరప, శనగ, మామిడి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోత కోసిన పంటలేకాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్దయిందని తెలిపారు.
తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.20వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.40వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి అక్కడి నుంచి నిధులు రాబట్టుకోవాలని కోరారు.