
వెంకమ్మ చెరువు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు 2013 చట్ట ప్రకారం ఎకరాకు రూ.8 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసిత రైతులు నీటి పారుదల శాఖ ఈ ఈ సురేష్ కుమార్ ను వేడుకున్నారు. మండలంలోని మల్లాయిగూడెం లో శుక్రవారం ఆయన భూ నిర్వాసితుల తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూసేకరణ సమయంలో నిర్ణయించిన ఎకరాకు రూ.1.35 లక్షలు చొప్పున 72 ఎకరాలకు రూ.78 లక్షలు మంజూరు అయిందని, ఈ ఈ సురేష్ కుమార్ రైతులకు వివరించారు. మీరు అంగీకరిస్తే వెంటనే చెల్లిస్తామని చెప్పారు. ఈ పరిహారం తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. ఎప్పుడో నిర్ణయించిన పరిహారం మాకు అవసరం లేదని, 2013 చట్ట ప్రకారం రూ.3 లక్షలు చెల్లిస్తేనే తీసుకుంటామని రైతులు తేల్చి చెప్పారు. దీనితో రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అందిస్తే ఉన్నతాధికారులకు పంపించి, అదనపు నిధులు మంజూరుకు కృషి చేస్తానని రైతులకు హమీ ఇచ్చారు.
సమావేశంలో డీ ఈ ఈ ఎల్. కృష్ణ, ఏఈ కె. కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.