నవతెలంగాణ-గార్ల: వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి జి.సక్రు డిమాండ్ చేశారు.ఇటివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని అఖిల భారత రైతు సంఘం అధ్వర్యంలో మంగళవారం స్దానిక తహసిల్దార్ కార్యాలయం ముందు అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా మండలంలోని అనేక గ్రామాలలో వరి,మిరప నార్లు పోసుకొని, ప్రత్తి పంటలు వేసుకున్న రైతుల పంటలు వర్షాలకు మొత్తం కొట్టుకొని పోయి, పొలాలు, చేనులలో ఇసుక మేటలు పెట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా వారిని పట్టించుకోకపోవడం శోచనీయం అని ఆందోళన వ్యక్తం చేశారు.మండలంలోని రాంపురం సమీపంలో ఉన్న పాకాల చెక్ డ్యాం వరద నీటి ప్రవాహానికి ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం అని ఆవేదన వెలిబుచ్చారు. అధికారులు స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించి ఆదుకోవాలని డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని ఇంచార్జ్ తహశీల్దారు వీరన్న కు అందించారు.ముందుగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.మనోహర్, యం. వీరభద్రం, నాయకులు సక్రు, వీరు, రంగమ్మ, వెంకన్న, సర్వయ్య, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీటిని అధికారులు తక్షణమే సరఫరా చేయాలి
నవతెలంగాణ-గార్ల: మండలంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక అయిదు రోజులు గడుస్తుందని తక్షణమే మిషన్ భగీరథ నీటిని అందించేందుకు మిషన్ భగీరథ అధికారులు కృషి చేయాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మండలంలోని వివిధ గ్రామాలలో మిషన్ భగీరథ నీరు రాక, పట్టణ కేంద్రం లో మిషన్ భగీరథ తో పాటు, పంచాయతీ నుండి మంచి నీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోపక్క సీజనల్ వ్యాధులు వ్యాపించడం, ఐదు రోజులైన మిషన్ భగీరథ నీళ్లు అందించకపోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత వైఖరికి నిదర్శనంగా పేర్కోన్నారు. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపించి మిషన్ భగీరథ నళ్ళా నీళ్లను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.