– రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించ రాదు..
– ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు గండి తో నిర్వాసితులు అయిన వడ్డి రంగాపురం,కోయ రంగాపురం,మేకల బండ తదితర గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసి రైతులు తమకు నష్ట పరిహారం ఇప్పించి స్థానిక గ్రామసభల ద్వారా నిజనిర్ధారణ చేసి ఎంపికలు జరిపి సహాయం చేయాలని స్థానిక తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు ఆదివాసి సేన నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేసారు. అనంతరం ఆదివాసి సేన మండల అధ్యక్షులు సోందెం సుమన్ బాబు,మండల నాయకులు వగ్గెల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తో చిన్న తరహా ప్రాజెక్టు అయిన గుమ్మడవల్లి ప్రాజెక్టు కట్ట తెగి వందలాది మంది రైతులు నిరాశ్రయులయ్యారు అని అన్నారు. విపరీతమైన పంట నష్టపోవడం ఆదివాసీలకు ఫల సహాయం అందించే అటువంటి జీడి మామిడి తోటలు తాటి చెట్లు అలాగే వేసిన పంటలు భూములు ఇంకా 20 సంవత్సరాలు పని చేయటానికి వీలుకాని విధంగా వరద ప్రవాహానికి విపరీతంగా కొట్టుకొని వెళ్లడం జరిగింది కానీ కొంతమంది గిరిజనేతరులను మాత్రమే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపిక చేసి వారిని మాత్రమే నిజమైన అర్హులని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు తప్ప ఎక్కడ వందలాదిమంది ఆదివాసీలు వారి యొక్క పంటలు కొట్టుకొని వెళ్లడం జరిగిందని వారికి న్యాయం చేయకుండా ఐదవ షెడ్యూల్ ప్రాంత చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా గౌరవించ కుండా చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు విరుద్ధంగా ఉన్నటువంటి గిరిజనేతరులను అర్హులుగా చూపడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దానికి వత్తాసు పలుకుతున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రులు ప్రభుత్వ అధికారులు దేనికి సంకేతాలు ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి అని వారు దుయ్యబట్టారు. అలాగే వెంటనే స్థానిక గ్రామ సభలు ద్వారా నిజనిర్ధారణ జరిపి అర్హులైన వారికి భూమికి భూమి పంట నష్టపరిహారం ఇతర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తగు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే ప్రాజెక్టుకు తక్షణమే 100 కోట్ల నిధులను విడుదల చేసి వారికి న్యాయం చేయాలని వారు కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు చెరువు మధ్యలో కూడా గిరిజనేతరులు చట్టవిరుద్ధంగా పట్టాలు పొంది రైతు బంధు తదితర సహాయాలు అక్రమంగా పొందుతున్నారని వాటిని వెంటనే నిలుపుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.