జట్టుగా పోటీ..ఉమ్మడిగా పోరాటం

– 30లోగా సీట్ల సర్దుబాటు
– దేశవ్యాప్తంగా భారీ సభలు, ర్యాలీలు

– సమన్వయ కమిటీతోపాటు ఐదు కమిటీల నియామకం
– దాడులు, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టీకరణ
– వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఇండియా కూటమి నిర్ణయం
రాబోయే లోక్‌సభ ఎన్నికలలో మతతత్వ బీజేపీని మట్టికరిపించేందుకు కలసికట్టుగా పోరాడాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. ముంబయిలో రెండు రోజుల పాటు జరిగిన 28 పార్టీల ఇండియా కూటమి సమావేశం శుక్రవారం ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. సాధ్యమైనంత వరకూ ఉమ్మడి పోరాటం సాగించాలని, ఇందుకోసం వెంటనే సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ప్రారంభించి ఈ నెల 30వ తేదీ లోగా ముగించాలని, ఈ ప్రక్రియలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, మీడియా కమిటీతో పాటు సామాజిక మాధ్యమాల కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేశారు. చంద్రయాన్‌ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో బృందాన్ని సమావేశం అభినందించింది. సమావేశ తీర్మానాలను శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) నేత ఆదిత్య ఠాక్రే చదివి వినిపించారు.
న్యూఢిల్లీ: ‘ఇండియా ఏకమవుతోంది… ఇండియా గెలుస్తుంది’ అనే నినాదంతో ముందుకు సాగనున్నట్టు ఇండియా కూటమి కూటమి ప్రకటించింది. ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలు, ప్రజా సమస్యలపై దేశంలోని వివిధ ప్రాంతాలలో సాధ్యమైనంత త్వరగా భారీ సభలు, ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
బీజేపీకి అధికారం కల్ల
ఈ వేదిక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందని సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఈ పార్టీలన్నీ ఏకమైతే బీజేపీ అధికారంలోకి రావడం అసంభవమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సమర్ధవంతంగా పని చేయాలని, అందుకోసమే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటామన్న నమ్మకం తమకు ఉన్నదని అన్నారు. కలసికట్టుగా పని చేయాలని నిర్ణయించామని, దేశ ప్రజలు త్వరలోనే ఇండియా కూటమిని పాలకులుగా చూస్తారని జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ చెప్పారు. ‘మా పాలనలో మీరు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకూ మీరు వారి అధీనంలో ఉన్నారు. మేము అధికారంలోకి రాగానే వారి కబంధ హస్తాల నుండి బయటపడతారు’ అని ప్రజలనుద్దేశించి అన్నారు. ప్రతిపక్ష కూటమి మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తాయని, కానీ రాబోయే రోజులలో తమ సమావేశాలకు హాజరై వాస్తవాలు గ్రహిస్తాయని అమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కోసమే తామంతా ఏకమయ్యామని, ఇక్కడ ఎవరూ సీట్ల కోసం పోటీ పడడం లేదని చెప్పారు. భారత చరిత్రలోనే మోడీ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందని కేజ్రీవాల్‌ అన్నారు. ‘మన యువతకు ఉద్యోగాలు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ కంపెనీ కోసం పనిచేస్తోంది. ప్రజలకు ఆదాయం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం నిధులన్నింటినీ ఒక వ్యక్తి కోసం మళ్లిస్తోంది’ అని మండిపడ్డారు.
ఇండియా బ్యానర్‌ ప్రతిపక్షాలను ఏకం చేసిందని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ఆయన తమిళంలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు వేర్వేరుగా ఉన్నందునే ఇప్పటివరకూ మోడీ ఆటలు సాగాయని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని మొదటి నుండీ తాము చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు.
మోడీ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని, అధికారంలోకి రావడానికి చౌకబారు ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ముందుగా దేశాన్ని రక్షించుకోవాలని, ఆ తర్వాత దేశాన్ని చక్కదిద్దుకోవాలని, ఇదే తమ లక్ష్యమని చెప్పారు.
దాడులకు వెరవం
సమావేశం విజయవంతమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. ప్రతిపక్ష సమావేశాలు విజయవంతం కావడం చూసిన ప్రధాని మోడీ ఇండియా కూటమిపై దాడి చేయడంతో పాటు మన దేశం పేరును ఉగ్రవాద సంస్థతో పోల్చారని, బానిసత్వానికి చిహ్నమంటూ అపహాస్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాల కారణంగా రాబోయే రోజులలో మరిన్ని దాడులు, అరెస్టులు జరగవచ్చునని అంటూ వాటికి సిద్ధమేనని ప్రకటించారు. సమావేశ తీర్మానాన్ని చదివిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు పలు అంశాలపై చర్చించాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న ధరలపై అందరూ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ‘మోడీ ముందుగా ధరను 100 రూపాయలు పెంచుతారు. ఆ తర్వాత రెండు రూపాయలు తగ్గిస్తారు. పెట్రోల్‌ ధరల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు గ్యాస్‌ ధరల విషయంలోనూ అలాగే జరుగుతోంది. ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే మోడీకి పట్టడం లేదు. తన రాజకీయ ప్రయోజనాలు, స్నేహితుల వ్యాపార ప్రయోజ నాల కోసమే ఆయన పని చేస్తారు’ అని ఎద్దేవా చేశారు.
అదానీపై వచ్చిన తాజా ఆరోపణలపై ప్రధాని ఎందుకు విచారణ జరిపించడం లేదని ఖర్గే నిలదీశారు. గత దశాబ్ద కాలంలో స్వతంత్ర సంస్థలన్నింటినీ నాశనం చేశారని, ఈడీ నుండి సీబీఐ వరకూ ప్రతి స్వయం ప్రతిపత్తి సంస్థ మోడీ ఎదుట సాగిలపడుతోందని నిప్పులు చెరిగారు. మణిపూర్‌ తగలబడుతుంటే పార్లమెంటును సమావేశపరచలేదని, కోవిడ్‌ సమయంలోనూ, నోట్ల రద్దు సమయంలోనూ సభను నిర్వహించలేదని, కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇస్రోకు అభినందన
గతంలోనూ, ఇప్పుడు ఇస్రో సాధించిన విజయాలను ప్రతిపక్ష సమావేశం కొనియాడింది. ఇది ఆరు దశాబ్దాల కృషి అంటూ ప్రశంసించింది. కాగా ఉదయం నుండి మొదలైన చర్చలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ కొనసాగాయి. 28 పార్టీలకు చెందిన 48 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
19 మందితో ప్రచార కమిటీ
ఇండియా కూటమి 19 మందితో ప్రచార కమిటీ నియమించింది. గుర్దీప్‌ సింగ్‌ సప్పల్‌ (కాంగ్రెస్‌), సంజరు ఝా (జేడీయూ), అనిల్‌ దేశారు (శివసేన-ఠాక్రే), సంజరు యాదవ్‌ (ఆర్జేడీ), పీసీ చాకో (ఎన్‌సీపీ), చంపై సోరెన్‌ (జేఎంఎం), కిరణ్మోరు నందా (ఎస్పీ), సంజరు సింగ్‌ (ఆప్‌), అరుణ్‌ కుమార్‌ (సీపీఎం), బినోరు విశ్వం (సీపీఐ), జస్టిస్‌ (రిటైర్డ్‌) హస్నైన్‌ మసూది (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), షాహిద్‌ సిద్ధిఖీ (ఆర్‌ఎల్డీ), ఎన్‌ కె ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్పీ), దేవరాజన్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌) రవి రారు (సీపీఐ(ఎంఎల్‌)), తిరుమావలన్‌ (వీసీకే), కెఎం కాదర్‌ మొయిదిన్‌ (ఐయూఎంఎల్‌), జోస్‌ కె. మణి (కేసీ(ఎం)) ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. టీఎంసీ తరువాత పేరు ఇస్తుంది.
12 మందితో సోషల్‌ మీడియా వర్కింగ్‌ గ్రూప్‌
ఇండియా కూటమి 12 మందితో సోషల్‌ మీడియా వర్కింగ్‌ గ్రూప్‌ను నియమించింది. సుప్రియా శ్రీనాటే (కాంగ్రెస్‌), సుమిత్‌ శర్మ (ఆర్జేడి), ఆశిష్‌ యాదవ్‌ (ఎస్పీ), రాజీవ్‌ నిగమ్‌, (ఎస్పీ), రాఘవ్‌ చద్దా (ఆప్‌), అవిందాని (జేఎంఎం), ఇల్తిజా మెహబూబా (పీడీపీ), ప్రాంజల్‌ (సీపీఐ(ఎం)), డాక్టర్‌ భాలచంద్రన్‌ కాంగో (సీపీఐ), ఇఫ్రా జా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), వి అరుణ్‌ కుమార్‌ (సీపీఐ(ఎంఎల్‌)) ఈ కమిటీలో సభ్యులుగా నియమితుల య్యారు. టీఎంసీ తరువాత పేరు ఇస్తుంది.
19 మందితో మీడియా వర్కింగ్‌ గ్రూప్‌
ఇండియా కూటమి 19 మందితో మీడియా వర్కింగ్‌ గ్రూప్‌ నియమించింది. జైరాం రమేష్‌ (కాంగ్రెస్‌), మనోజ్‌ ఝా (ఆర్జేడీ), అరవింద్‌ సావంత్‌ (శివసేన-ఠాక్రే), జితేంద్ర అహ్వాద్‌ (ఎన్‌సీపీ), రాఘవ్‌ చద్దా (ఆప్‌), రాజీవ్‌ రంజన్‌ (జేడీయూ), ప్రాంజల్‌ (సీపీఐ(ఎం)), ఆశిష్‌ యాదవ్‌, (ఎస్పీ), సుప్రియో భట్టాచార్య (జేఎంఎం), అలోక్‌ కుమార్‌ (జేఎంఎం), మనీష్‌ కుమార్‌, (జేడీయూ), రాజీవ్‌ నిగమ్‌ (ఎస్పీ), భాలచంద్రన్‌ కాంగో (సీపీఐ), తన్వీర్‌ సాదిక్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), ప్రశాంత్‌ కన్నోజియా, నరేన్‌ ఛటర్జీ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), సుచేతా దే (సీపీఐఎంఎల్‌), మోహిత్‌ భాన్‌ (పీడీపీ)లను నియమించారు. టీఎంసీ తరువాత పేరు ఇస్తుంది.
ఐదుగురితో రీసెర్చ్‌ వర్కింగ్‌ గ్రూప్‌
ఇండియా కూటమి ఐదుగురితో రీసెర్చ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నియమించింది. అమితాబ్‌ దూబే (కాంగ్రెస్‌), ప్రొఫెసర్‌ సుబోధ్‌ మెహతా (ఆర్జేడీ), ప్రియాంక చతుర్వేది (శివసేన-ఠాక్రే), వందనా చవాన్‌ (ఎన్‌సీపీ), కెసి త్యాగి (జేడీయూ)లను నియమించింది.
సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీ కన్వీనర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలను త్వరలో ప్రకటించను న్నారు. ఈ స్థానాల్లో వెలువడుతున్న పేర్లు ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారనే చర్చను నివారించడానికి ఇది జరిగింది. వామపక్షాలు కూడా ఎన్నికలకు ముందు ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడాన్ని విభేదించాయి. భేటీలో ప్రకటించా ల్సిన లోగో విడుదలను కూడా వాయిదా పడింది. కొన్ని పార్టీలు నేరుగా ప్రజల నుంచి మరింత అర్థవంతమైన లోగో రావాలనే వైఖరిని ప్రకటించాయి.
సమన్వయ కమిటీలోకి తర్వాత…
ఇండియా కూటమి కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలో సీపీఐ(ఎం)కు ఒక స్థానం కేటాయించారు. అయితే సీపీఐ(ఎం)కమిటీ సభ్యుడిని త్వరలో ప్రకటించనుంది. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ తమ పార్టీలో చర్చించిన తరువాత సూచిస్తామన్నారు. తదుపరి భేటీ ఢిల్లీలో జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌సీపీ నేత సుప్రియా సోలే ప్రకటన చేశారు.
14 మందితో సమన్వయ కమిటీ, ఎన్నికల వ్యూహ కమిటీ
ఇండియా కూటమి 14 మందితో సమన్వయ కమిటీ, ఎన్నికల వ్యూహ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో కెసి వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ), టిఆర్‌ బాలు (డీఎంకే), జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ (జేఎంఎం), సంజరు రౌత్‌ (శివసేన), బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ (ఆర్జేడి), అభిషేక్‌ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్‌ చద్దా (ఆప్‌), జావేద్‌ ఖాన్‌ (ఎస్పీ), లలన్‌ సింగ్‌ (జేడీయూ), డి రాజా (సీపీఐ), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కన్వీనర్‌ను ప్రకటించలేదు.