చైనాతోనే పోటీ

– పారిశ్రామికవేత్తలకు సులభంగా అనుమతులు
– పెట్టుబడులు పెట్టండి :అమెరికా పారిశ్రామికవేత్తల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామన్నారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ రాష్ట్రంలో కూడా ఉన్నాయనీ, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేదే తమ సంకల్పమని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో నాలుగో నగరంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామన్నారు. దేశంలోనే జీరో కార్బన్‌ సిటీ ఇక్కడ ఏర్పడతుందనీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) హబ్‌తో పాటు మెడికల్‌, టూరిజం, స్పోర్ట్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా విలేజ్‌లను నిర్మిస్తామన్నారు. సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్‌, షిప్పింగ్‌ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్‌పర్సన్‌లు, సీఈవోలు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన పారిశ్రామిక క్లస్టర్లు, భవిష్యత్‌ ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై సీఎం రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.